
న్యూఢిల్లీ: ఒక టెలివిజన్ చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని, ఏబీవీపీ మాజీ నేత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఈ విధమైన వ్యాఖ్యలు చేసిన నేతపై వెంటనే చర్యలు తీసుకోకపోతే లోక్‌సభలో ప్రతిపక్ష నేతపై హింసకు పాల్పడినట్లు నిర్ధారణ అవుతుందని వేణుగోపాల్ వ్యాఖ్యానించారు.
ఆ లేఖలో కేసీ వేణుగోపాల్ ఆర్‌ఎస్‌ఎస్ విద్యార్థి విభాగం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ప్రింటు మహదేవ్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై హత్యా బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. మహదేవ్ బీజేపీ ప్రతినిధి అని, ఒక మలయాళ ఛానెల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో ఈ విధమైన వ్యాఖ్యలు చేశారన్నారు. రాహుల్ గాంధీని ఛాతీపై కాల్చి చంపాలని మహదేవ్ బహిరంగ ప్రకటన చేశారని, ఇది ఎంతమాత్రం నోరు జారడం కాదని, పొరపాటు, అతిశయోక్తి అంతకన్నా కాదన్నారు. ఇది ప్రతిపక్ష నేత, దేశంలోని అగ్ర రాజకీయ నాయకులలో ఒకరైన వ్యక్తికి ఎదురైన హత్యా బెదిరింపని వేణుగోపాల్ పేర్కొన్నారు.
బీజేపీ అధికార ప్రతినిధి ఇలాంటి విషపూరిత మాటలు మాట్లాడటం చూస్తుంటే రాహుల్ గాంధీ ప్రాణాలకు ముప్పు ఏర్పడటమే కాకుండా, రాజ్యాంగం ప్రకారం ప్రతీ పౌరునికి ఇవ్వవలసిన ప్రాథమిక భద్రతా హామీలకు భంగం వాటిల్లినట్లు అవుతుందని వేణుగోపాల్ అన్నారు. కాగా రాహుల్ గాంధీ భద్రతను పర్యవేక్షిస్తున్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) ఇటీవల రాహుల్ గాంధీ భద్రతకు ముప్పు ఉందని హోంశాఖకు పలు లేఖలు రాసిందని వేణుగోపాల్ గుర్తు చేశారు. అలాగే సీఆర్‌పీఎఫ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాసిన ఒక లేఖ అనుమానాస్పద పరిస్థితుల్లో మీడియాకు లీక్ అయ్యిందని అన్నారు. రాహుల్ గాంధీని తమ హక్కుల పరిరక్షకునిగా భావిస్తున్న లక్షలాది మంది భారతీయులు ఆయనకు ప్రాణహాని ఉందని తెలిసి, తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీకి ఎదురైన బెదిరింపు కేవలం ఒక వ్యక్తిపై దాడి కాదని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిపై జరిగిన దాడి అని అన్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య అని, అందుకే దీనిపై హోంశాఖ త్వరగా, నిర్ణయాత్మకంగా, బహిరంగంగా చర్య తీసుకోవడంలో విఫలమైతే, ఈ చర్యకు సహకరించినట్లు అవుతుందని వేణుగోపాల్ పేర్కొన్నారు.