
ప్రధాని మోదీపై కాంగ్రెస్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: దేశం ఎదుర్కొంటున్న అతిముఖ్యమైన విషయాలను వదిలేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ విదేశీ పర్యటనలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. మణిపూర్‌లో కల్లోల పరిస్థితులు కొనసాగుతున్నా పట్టించుకోవడం లేదని, అక్కడికి ఒక్కసారి కూడా వెళ్లలేదని విమర్శించింది. అదేవిధంగా, భారత్–పాక్‌ల మధ్య కాల్పుల విరమణకు తానే కారణమంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే ప్రకటనలు చేస్తున్నా మోదీ మౌనంగా ఉంటున్నారంటూ మంగళవారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ‘ఎక్స్’లో పలు వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని మోదీ నిర్ణయాల కారణంగానే ఆపరేషన్ సిందూర్‌లో మొదటి రెండు రోజుల్లో మనకు నష్టాలు మిగిలాయని రక్షణ శాఖ అధికారులు చేస్తున్న ఆరోపణలకు ఆయన సమాధానమివ్వడం లేదన్నారు. పహల్గాంలో దారుణానికి పాల్పడిన ఉగ్రవాదులను 70 రోజుల తర్వాత కూడా పట్టుకోలేకపోయారని విమర్శించారు. ఇది ప్రధాని తీవ్ర వైఫల్యంగా ఆయన పేర్కొన్నారు. ‘విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ఎవరైనా వాటిని ఎదుర్కొని నిలబడతారు. మన ప్రధాని మాత్రం విదేశాలకు పయనమవుతారు’అని వ్యంగ్యా్రస్తాలు సంధించారు. ఈ నెల 2 నుంచి 8 రోజులపాటు ప్రధాని మోదీ 5 దేశాల పర్యటించనుండటం తెల్సిందే.