న్యూఢిల్లీ: పాస్‌పోర్టు, దేశ పౌరసత్వానికి రుజువు కాదంటూ కేంద్రం ఇచ్చిన వివరణపై వివాదం రగులుతున్న వేళ కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ స్పందించారు. పాస్‌పోర్ట్, ఆధార్ కార్డులను దేశ పౌరసత్వానికి రుజువులుగా మార్చేలా నిబంధనలను సవరించాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు.
ప్రస్తుతం ఆధార్ కార్డును పౌరసత్వం ఆధారంగా కాకుండా ఒక వ్యక్తి ఇక్కడ 182 రోజుల పాటు నివసించారా లేదా అనే ప్రాతిపదిక ఆధారంగా జారీ చేస్తున్నారు. అందువల్ల ప్రస్తుతం దేశ పౌరులతో పాటు, ఇక్కడ నివసించే విదేశీయుల వద్ద కూడా ఆధార్ ఉందని చెప్పారు. అందుకే దేశంలో నివసించే విదేశీయులకు ప్రత్యేక డిజైన్ కలిగిన ఆధార్ కార్డును పరిచయం చేయాలని సూచించారు.
దశాబ్దాలుగా పాస్‌పోర్ట్‌ను పౌరసత్వ గుర్తింపునకు అత్యున్నత ప్రమాణంగా భావిస్తున్నప్పుడు..అది కూడా పౌరసత్వాన్ని నిరూపించలేకపోతే, మరి ఏది నిరూపిస్తుంది? అని థరూర్ ప్రశ్నించారు. ఈ అర్థరహిత వివాదంపై తలెత్తిన వివాదానికి శాశ్వత పరిష్కారం కోసం తార్కిక, చట్టపరంగా నిబంధనలను మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.


