పాక్‌తో కాల్పుల విరమణ.. 1971లో ఇందిర నిర్ణయంపై చర్చ! | Congress seeks PM modi led all party meeting | Sakshi
Sakshi News home page

పాక్‌తో కాల్పుల విరమణ.. 1971లో ఇందిర నిర్ణయంపై చర్చ!

May 11 2025 9:31 AM | Updated on May 11 2025 10:39 AM

Congress seeks PM modi led all party meeting

ఢిల్లీ: భారత్, పాక్ యుద్ధానికి(India-Pakistan War) శనివారం సాయంత్రం కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌, ప్రస్తుత పరిస్థితులపై కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్నారు. కొందరు హస్తం నేతలు కేంద్రం నిర్ణయాన్ని సమర్థిస్తుండగా.. మరికొందరు మాత్రం ఇందిర కాలం నాటి పరిస్థితులను ప్రస్తావిస్తున్నారు.

భారత్‌, పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన తర్వాత ఎంపీ శశిథరూర్‌ స్పందించారు. శశిథరూర్‌ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘నాకు చాలా సంతోషంగా ఉంది. భారత్ ఎప్పుడూ దీర్ఘకాలిక యుద్ధాన్ని కోరుకోలేదు. కానీ ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పాలనుకుంది. ఆ గుణపాఠం చెప్పారని నేను నమ్ముతున్నాను. అలాగే, మాట తప్పడం పాకిస్తాన్‌ నైజం. వారి వాగ్దానాలను ఎలా నమ్ముతాం? అని సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు.

ఇదే సమయంలో 1971లో జరిగిన యుద్ధంపై కూడా శశిథరూర్‌ స్పందించారు. ఈ సందర్భంగా శశిథరూర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘1971లో ఒక గొప్ప విజయం అందుకున్నాం. ఇందిరా గాంధీ ఉపఖండం మ్యాప్‌ను తిరగ రాశారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. బంగ్లాదేశ్ నైతిక లక్ష్యంతో పోరాడుతోంది. పాకిస్తాన్‌పై దాడులు చేయడం, బాంబులు పేల్చడం మాత్రమే స్పష్టమైన లక్ష్యం కాదు అని కామెంట్స్‌ చేశారు.

అయితే, పాకిస్తాన్‌తో కాల్పులు విరమణ ఒప్పందం జరిగిన వేళ ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా తీసుకున్న చర్యను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైఖరితో పోల్చుతూ సోషల్ మీడియా ప్రచారం జరుగుతోంది. దీనిపై పలు నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

మరోవైపు.. పాకిస్తాన్‌తో కాల్పులు విరమణ ఒ‍ప్పందంపై కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. తాజాగా.. కాల్పుల విరమణ అంశంపై తక్షణం ప్రధాని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. పార్లమెంటు ప్రత్యేక సెషన్‌ నిర్వహించి ప్రజల ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని కోరింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్‌ రమేష్‌ ట్విట్టర్‌ వేదికగా.. ‘వాషింగ్టన్‌ నుంచి కాల్పుల విరమణ ప్రకటన వచ్చిన నేపథ్యంలో ప్రధాని అధ్యక్షతన తక్షణం అఖిలపక్ష సమావేశం జరగాలి. పార్లమెంటు ప్రత్యేక భేటీని ఏర్పాటుచేసి గత కొన్ని రోజులుగా జరుగుతున్న అంశాలను చర్చించాలి’ అని డిమాండ్‌ చేశారు. 

 

మరో కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేడా స్పందిస్తూ.. గత 5,6 రోజుల్లో దేశం ఏం సాధించిందో, ఏం కోల్పోయిందో ప్రజలకు ప్రభుత్వం చెప్పాలని పేర్కొన్నారు. అలాగే, 1971 యుద్ధం సందర్భంగా సైనికులతో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దిగిన ఫొటోలను కాంగ్రెస్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. ఇందిర లేని లోటు కనిపిస్తోందని పేర్కొంది. ‘ఇందిర ధైర్యం చూపారు. దేశం కోసం నిలబడ్డారు. జాతి పౌరుషంతో ఆమె రాజీ పడలేదు’ అని కాంగ్రెస్‌ తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement