
బెంగళూరు: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీపై సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టు పెట్టిన యువకుడిని బెంగళూరు బండెపాళ్య పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు యువకుడు.. ప్రధాని మోదీ ఇంటిపై బాంబు దాడి చేయాలని పిలుపునిస్తూ సోషల్ మీడియాలో వీడియోను పోస్టు చేశాడు. దీంతో, అతడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెప్పుకొచ్చారు.
వివరాల ప్రకారం.. కర్ణాటకలోని మంగనమ్మనపాళ్యకు చెందిన నవాజ్.. ఇటీవల పాకిస్తాన్‌తో యుద్ధం సమయంలో ప్రధాని మోదీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి ఆ వీడియో తీశాడు. దీనిని పబ్లిక్ సర్వేంట్ పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నవాజ్ వీడియోలో మాట్లాడుతూ..‘పాకిస్తాన్‌పై బాంబు దాడులు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ ఇంటిపై పాకిస్తాన్ ఎందుకు బాంబులు వేయడం లేదు. బాంబు దాడికి నేను పిలుపునిస్తున్నా. బాంబు దాడి చేయాలనుకుంటున్నా’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీడియో గురించి తెలిసి పోలీసులు.. అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిందితుడిని గుర్తించి నిర్బంధించారు. కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు. ఈ సందర్భంగా జాయింట్ కమిషనర్ (తూర్పు) రమేష్ బానోత్ మాట్లాడుతూ..‘ఎలక్ట్రానిక్ సిటీకి చెందిన నవాజ్ కంప్యూటర్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. రెచ్చగొట్టే కంటెంట్ ఉన్నందుకు అతడిని అరెస్ట్ చేయడం జరిగింది. బండేపాళ్య పోలీసులు అతన్ని అరెస్టు చేసి పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు రిమాండ్ చేశారు. అతనిపై తుమకూరులో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) కేసు పెండింగ్‌లో ఉందని తేలింది. ఈ పోస్ట్ వెనుక ఉన్న ఉద్దేశ్యంపై పోలీసులు తదుపరి దర్యాప్తు ప్రారంభించారు. నవాజ్‌ను జ్యుడీషియల్ కస్టడీ కోసం కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.