నింద మాటున ప్రభుత్వాలు కూల్చేస్తారా? | Opposition parties Fires On PM Modi govt for Bill to remove PM, CM | Sakshi
Sakshi News home page

నింద మాటున ప్రభుత్వాలు కూల్చేస్తారా?

Aug 21 2025 1:12 AM | Updated on Aug 21 2025 1:12 AM

Opposition parties Fires On PM Modi govt for Bill to remove PM, CM

న్యాయస్థానాల్లో విచారణ జరగకుండానే, నేర నిరూపణ కాకుండానే పడగొడతారా?

ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రుల తొలగింపు బిల్లులపై విపక్షాల ముప్పేట దాడి

బిల్లు ప్రతులను చింపేసి అమిత్‌ షా పైకి విసిరేసిన విపక్ష సభ్యులు 

నేరారోపణలు ఎదుర్కొంటూ ఏకధాటిగా 30 రోజులు కస్టడీలో ఉంటే పదవుల నుంచి తొలగించే మూడు బిల్లుల రూపకల్పన 

బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్రం.. వెంటనే తీవ్ర ఆందోళనకు దిగిన విపక్ష పార్టీలు 

విపక్షపాలిత ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకే ఈ బిల్లులు తెచ్చారని మండిపాటు.. అధికార పార్టీ ఎంపీలతో వాగ్వాదం 

తీవ్ర గందరగోళం నడుమ బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేసిన మోదీ సర్కార్‌

న్యూఢిల్లీ: నేరం రుజువుకాకపోయినా కేవలం నిందారోపణలు ఉన్నాయన్న సాకుతో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన విపక్షపాలిత ప్రభుత్వాలను పడగొడతారా? అంటూ పార్లమెంట్‌ సాక్షిగా మోదీ ప్రభుత్వంపై విపక్ష పార్టీలు ముప్పేటదాడి చేశాయి. విపక్షపాలిత రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్రతో ఈ మూడు బిల్లులను రూపొందించారని విపక్ష సభ్యులు లోక్‌సభలో ధ్వజమెత్తారు. బిల్లులను తక్షణం ఉపసంహరించుకోవాలని నినాదాలతో హోరెత్తించారు. 

అయితే బిల్లులను సమర్థిస్తూ అధికార పార్టీ సభ్యులు సైతం దీటుగా స్పందించడంతో లోక్‌సభలో ఒక్కసారిగా మాటల మంటలు రాజుకున్నాయి. అధికార, విపక్ష సభ్యుల వాగ్వాదం మధ్య వివాదాస్పద మూడు బిల్లులను ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సిఫార్సుచేసింది. తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటూ ఏకధాటిగా 30 రోజులుగా కస్టడీలో గడుపుతున్న ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్రమంత్రులను పదవి నుంచి తొలగించేందుకు ఉద్దేశించిన మూడు బిల్లులను లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టింది. 

వెనువెంటనే విపక్ష పార్టీలపాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలదోసేందుకే మోదీ సర్కార్‌ ఇలా అత్యంత వివాదాస్పద మూడు బిల్లులను తీసుకొచ్చిందంటూ బుధవారం లోక్‌సభలో విపక్షపార్టీల ఎంపీలు తీవ్ర ఆందోళనకు దిగారు. ఒకదశలో బిల్లు ప్రతులను చింపేసి ఆ ముక్కలను హోంమంత్రి అమిత్‌షా వైపు విసిరేశారు. 

ఐదేళ్లు, అంతకంటే ఎక్కువ శిక్ష పడే తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటూ అరెస్టయి, కస్టడీలో ఏకధాటిగా 30 రోజులుగా ఉన్న సందర్భాల్లో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు ఉద్దేశిస్తూ ‘గవర్నమెంట్‌ ఆఫ్‌ యూనియన్‌ టెరిటరీస్‌(సవరణ)బిల్లు, 2025, రాజ్యాంగం(130వ సవరణ)బిల్లు, 2025, జమ్మూకశ్మీర్‌ పునర్‌వ్యవస్థీకరణ(సవరణ)బిల్లు, 2025’బిల్లులను అమిత్‌షా లోక్‌సభలో ప్రవేశపెట్టగానే గొడవ మొదలైంది. 

అమిత్, వేణుగోపాల్‌ మధ్య మాటల యుద్ధం 
బిల్లు ప్రవేశపెట్టగానే అమిత్‌షానుద్దేశిస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ సభ్యుడు కేసీ వేణుగోపాల్‌ మాటలతో విరుచుకుపడ్డారు. ‘‘రాజ్యాంగ మౌలికసూత్రాలను ఈ బిల్లులు ఉల్లంఘిస్తున్నాయి. 2010లో సోహ్రబుద్దీన్‌ షేక్‌ నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసులో ఆనాడు రాష్ట్ర హోం మంత్రిగా పదవి వెలగబెడుతూనే అమిత్‌షా అరెస్టయ్యారు. సీబీఐ అరెస్ట్‌తో మూడు నెలలు జైళ్లోనే గడిపారు. 

మరి ఈ నైతికత ఆనాడు మీకు లేదా?’’అని వేణుగోపాల్‌ సూటి ప్రశ్న వేశారు. దీనికి ఇతర సభ్యులు గొంతు కలిపారు. దీంతో అమిత్‌షా దీటుగా బదులిచ్చారు. ‘‘అదొక తప్పుడు కేసు. అయినాసరే అరెస్టయిన వెంటనే పదవికి త్యజించి నా నైతికతను నిరూపించుకున్నా. పదవికి రాజీనామా చేశా. కేసులో నిర్దోషిగా బయటపడేదాకా ఎలాంటి చట్టబద్ద పదవిని చేపట్టలేదు’’అని అన్నారు. 

మధ్యాహ్నం సభ రెండుగంటలకు మళ్లీ మొదలయ్యాక ఈ మూడు బిల్లులను సంయుక్త పార్లమెంట్‌ కమిటీకి సిఫార్సుచేస్తూ తీర్మానం చేసి మూజువాణి ఓటుతో ఆమోదించిన సందర్భంలో విపక్షసభ్యులు మళ్లీ లేచి నిలబడి నినాదాలుచేశారు. అప్పటికే ఈ మూడు బిల్లుల ప్రతులను కాంగ్రెస్‌ ఎంపీలు జ్యోతిమణి, ప్రణీత షిండే తోటి ఎంపీలకు పంచారు. 

తమ చేతికొచ్చిన బిల్లుల ప్రతులను తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత కళ్యాణ్‌ బెనర్జీసహా పలువురు విపక్షసభ్యులు చింపేసి అమిత్‌షా వైపు విసిరేశారు. కొన్ని షా సీటు వద్ద పడ్డాయి. షా ముందున్న మైక్రోఫోన్‌ను లాగిపడేసేందుకు బెనర్జీ విఫలయత్నంచేశారు. దీంతో షాకు రక్షణగా కేంద్ర మంత్రి రవ్‌నీత్‌ సింగ్‌ బిట్టూ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్‌ రిజిజులు షా సీటు వద్దకు వచ్చి అడ్డుగా నిలబడ్డారు. 

వెల్‌లోకి దూసుకొచ్చిన టీఎంసీ మహిళానేత మహువా మొయిత్రాసహా విపక్షనేతల నినాదాలతో సభ మార్మోగింది. కొందరు బీజేపీ సభ్యులు సైతం వెల్‌లోకి దూసుకొచ్చి విపక్షసభ్యులతో వాగ్వాదానికి దిగారు. వీరిని బీజేపీ సభ్యుడునిషికాంత్‌ దూబే వారించి తమతమ సీట్ల వద్దకు పంపించారు. వివాదాస్పద బిల్లులను ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా తప్పుబడుతూ ఎంఐఎ నేత అసదుద్దీన్‌ ఒవైసీ, కాంగ్రెస్‌ నేత మనీశ్‌ తివారీ, ఆర్‌ఎస్‌పీ నేత ఎన్‌కే ప్రేమచంద్రన్, కాంగ్రెస్‌ నేత కేసీ వేణుగోపాల్, ఎస్పీ నేత ధర్మేంద్ర యాదవ్‌ మాట్లాడారు. 

తర్వాత సభ మూడు గంటలకు మొదలయ్యాక అమిత్‌ షాకు రక్షణగా పార్లమెంట్‌ సెక్యూరిటీ సరీ్వస్‌ నుంచి 12 మంది మార్షల్స్‌ వచ్చి పక్కనే నిలబడ్డారు. అయినాసరే విపక్షసభ్యులు బిల్లుల వ్యతిరేక నినాదాలను కొనసాగించారు. యావత్‌ ఘటనపై స్పీకర్‌ తీవ్రవిచారం వ్యక్తంచేశారు. ఇలాంటి ఉదంతాలు సభ గౌరవాన్ని తగ్గిస్తున్నాయని ఓం బిర్లా ఆవేదన వ్యక్తంచేశారు. ఎల్లవేళలా తెలుపురంగు టీ–షర్ట్‌ ధరించే లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ మూడు బిల్లులను వ్యతిరేకిస్తూ అందుకు నిరసనగా నలుపురంగు టీ–షర్ట్‌ ధరించారు.  

ఎవరేమన్నారంటే.. 
పోలీస్‌ రాజ్యంగా మారుస్తున్నారు 
‘‘ఇలా మూడు అక్రమ చట్టాలను తెచ్చి భారత్‌ను పోలీస్‌ రాజ్యంగా మార్చాలనుకుంటున్నారు. సీబీఐ, ఈడీ వంటి ఏజెన్సీలు ఇష్టారీతిన అరెస్ట్‌చేసేందుకు మోదీ సర్కార్‌ మరింత స్వేచ్చనిస్తోంది. ఈ ఏజెన్సీలే జడ్జీలుగా, కార్యనిర్వాహక వ్యవస్థలుగా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ పోకడ ఎన్నికల ద్వారా కొలువుతీరిన ప్రభుత్వాలకు మరణశాసనం వంటిది. ఈ మూడు బిల్లులు హిట్లర్‌ పాలనలో నాజీ సైన్యం అధికారిక రహస్య పోలీస్‌ విభాగాన్ని గుర్తుకుతెస్తున్నాయి. విపక్షాలపాలిత రాష్ట్రప్రభుత్వాలను అస్థిరపరిచేందుకే బిల్లులను తెచ్చారు’’ 
– ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ 

రాజ్యాంగ మౌలికస్వరూపాన్ని నాశనంచేస్తున్నారు. 
‘‘రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని సర్వనాశనం చేసేలా ఈ మూడు బిల్లులను తీసుకొచ్చారు. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ప్రభుత్వం ఇప్పటికే దుర్వినియోగపరుస్తోంది. ఇక ఈ మూడు బిల్లులు చట్టాలుగా మారితే ఈ రాజకీయ దురి్వనియోగ వరదకు గేట్లు ఎత్తినట్లే అవుతుంది. ఈ ధోరణిని ఇప్పటికే సర్వోన్నత న్యాయస్థానం సైతం తూర్పారబట్టింది. కొత్త బిల్లులు రాజ్యాంగపరిరక్షణ అ్రస్తాలను నిర్వీర్యంచేస్తున్నాయి’’ 
– కాంగ్రెస్‌ నేత మనీశ్‌ తివారీ 

‘జైలు’పాలనపై నిర్ణయం ప్రజలదే 
‘‘తమ పీఎం, సీఎం, మంత్రులు తీవ్ర నేరారోపణలతో అరెస్టయి జైలు ఉండి అక్కడి నుంచే పరిపాలించడం ఎంతవరకు సబబో ప్రజలే నిర్ణయించుకోవాలి. ప్రజాజీవితం గడిపే పాలకుల్లో తగ్గుతున్న నైతికతకు చెక్‌పెట్టేందుకే ఈ మూడు బిల్లులన తెచ్చాం. రాజకీయాలకు మళ్లీ సమగ్రత తేవడమే బిల్లుల లక్ష్యం. భవిష్యత్తులో పాలకులు తీవ్రనేరాలతో జైలుపాలైనా అక్కడి నుంచే పరిపాలిస్తారని రాజ్యాంగ నిర్ణేతలు ఆనాడు రాజ్యాంగ రచన సమయంలో ఊహించి ఉండరు’’ 
– బీజేపీ అగ్రనేత అమిత్‌ షా 

మధ్యయుగాలకు మోసుకెళ్తాయి 
ఈ మూడు బిల్లులు మళ్లీ దేశాన్ని మధ్యయుగాల నాటి దురవస్థకు తీసుకెళ్తాయి. ఈ బిల్లులు చట్టాలుమారితే ఖచ్చితం మనం మధ్యయుగాలకు వెళ్తాం. అక్కడ రాజు తనకు నచ్చని వ్యక్తులను పదవుల నుంచి పక్కకు తప్పిస్తాడు. ఆ పదవిలోని వ్యక్తి ముఖం కూడా నచ్చలేదంటే ఈడీ రంగప్రవేశంచేసి అరెస్ట్‌చేస్తుంది. నేరారోపణ రుజువుకాకపోయినా కేవలం 30 రోజులుగా జైళ్లో ఉన్నాడన్న కారణం చూపి.. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన వ్యక్తి ప్రభుత్వాన్ని కూలదోస్తారు’’ 
– లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ 

అంత తొందరెందుకు? 
‘అత్యున్నత పదవుల్లోని నేతలను తొలగించేందుకు ఉద్దేశించిన ఇంతటి కీలకమైన బిల్లులను ఎందుకు హడావిడిగా ప్రవేశపెడుతున్నారు? బిల్లుల గురించి ముందస్తు సమాచారం లేదు. హడావిడిగా బిల్లుల ప్రతులను సభలో నామామాత్రం కొద్దిమందికి పంపిణీ చేసి వెంటనే బిల్లులను లోక్‌సభ ముందుకు తెచ్చారు. సభా నిబంధనలను ఈ బిల్లుల విషయంలో అస్సలు పాటించలేదు’’ 
– ఆర్‌ఎస్‌పీ పార్టీ సభ్యుడు, ఎంపీ ఎన్‌కే ప్రేమ్‌చంద్రన్‌ 

ప్రజాస్వామ్యశకానికి పాతరేసే కుట్ర 
‘‘భారత్‌లో ప్రజాస్వామ్య శకానికి ముగింపు పలికే దురుద్దేశంతో ప్రభుత్వం ఈ మూడు బిల్లులు తెచ్చింది. బిల్లులను తేవడం చూస్తుంటే సూపర్‌ ఎమర్జెన్సీ పీడకలను ప్రభుత్వ పెద్దలు సాకారంచేసుకునేందుకు వేసిన తొలి అడుగులా తోస్తోంది. దేశ న్యాయవ్యవస్థ స్వతంత్రను కాలరాసేందుకు ఈ బిల్లులను తెచ్చారు. ప్రజాస్వామ్యం, సమాఖ్య స్ఫూర్తిని సర్వనాశనంచేసే కుట్ర ఇది. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎంతకైనా తెగించి ఈ బిల్లులు చట్టాలుగా మారకుండా అడ్డుకుందాం’’ 
– టీఎంసీ చీఫ్‌ మమతా బెనర్జీ 

ఇది ఇంగిజ్ఞానానికి సంబంధించింది 
‘‘మీరు 30రోజులపాటు కస్టడీలో ఉండి కూడా మంత్రిగా పదవిలో కొనసాగుతానని వాదించడం ఎంత వరకు సమర్థనీయం? ఇది పూర్తిగా ఇంగితజ్ఞానానికి సంబంధించిన విషయం. ఈ మూడు బిల్లుల్లో నాకైతే ఎలాంటి తప్పు కనిపించట్లేదు. ఈ అంశం మినహా బిల్లుల్లో లోతైన అంశాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా సంయుక్త పార్లమెంట్‌ కమిటీలో చర్చించాల్సిందే. దేశ ప్రయోజనకర అంశాలు ఉన్నాయో లేదో తేల్చాలి’’ 
– తిరువనంతపురం కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement