
ఇస్లామాబాద్: భారత్, పాక్ పరస్పర సైనిక చర్యలో తమ సైనిక సిబ్బందిలో కేవలం 11 మంది చనిపోయారని పాకిస్తాన్ మంగళవారం ప్రకటించింది. వీరిలో స్క్వాడ్రాన్ లీడర్ ఉస్మాన్ యూసుఫ్ సైతం ఉన్నట్లు పేర్కొంది. భారత వైమానిక, క్షిపణి, డ్రోన్ దాడుల్లో సాయుధ బల గాలకు సంబంధించి 78 మంది గాయపడ్డారని పాకిస్తాన్ ఒక ప్రకటనలో పేర్కొంది.
భారత్ ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా మే ఆరో తేదీ అర్ధరాత్రి తర్వాత భారత్ జరిపిన దాడుల్లో 40 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని, 121 మంది పౌరులు గాయపడ్డారని తెలిపింది. చీఫ్ టెక్నీషియన్ ఔరంగజేబ్, సీనియర్ టెక్నీషియన్ నజీబ్, కార్పోరల్ టెక్నీషియన్ ఫరూఖ్, సీనియర్ టెక్నీషియన్ ముబాషిర్ సైతం ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. వీళ్లంతా ఏ పరిస్థితుల్లో మరణించారో, మరణానికి కారణాలను పాకిస్తాన్ బయటపెట్టలేదు. ఒక యుద్ధవిమానం పాక్షికంగా ధ్వంసమైందని తెలిపింది.
అయితే అది ఏ సంస్థ తయారీ, ఏ రకానికి చెందినది అనే వివరాలనూ పాక్‌స్తాన్ వెల్లడించలేదు. ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారంగా ‘మర్కా–ఇ–హక్ (ఘన విజయం)’ లక్ష్యంగా ‘ఆపరేషన్ బుని యాన్ అల్ మర్సుస్’ను చేపట్టామని ఆ ప్రకటన తెలిపింది. గాయపడిన సైనికులు, పౌరులను పరామర్శించేందుకు సోమవారం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ రావల్పిండిలోని కంబైన్డ్ మిలటరీ ఆస్పత్రిని సందర్శించడం తెల్సిందే. గాయపడిన సైనికాధికారులు, జవాన్లను ఓదార్చేందుకు లాహోర్‌లోని కంబైన్డ్ మిలటరీ ఆస్పత్రిని పంజాబ్ మహిళా ముఖ్యమంత్రి మర్యం నవాజ్ సందర్శించారు.
