ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రభుత్వం త్రివిధ దళాలను ఏకీకృత కమాండ్ కిందికి తీసుకు వచ్చేందుకు వీలుగా ‘చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్’అనే కొత్త పోస్టును సృష్టించింది. ఇందుకోసం షెహబాజ్ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేపట్టింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243లో ప్రతిపాదించిన మార్పులతో 27వ రాజ్యాంగ సవరణ బిల్లును శనివారం సెనేట్‌లో ప్రవేశపెట్టింది.
దీని ప్రకారం.. ఆర్మీ చీఫ్‌ను, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్‌ను ప్రధానమంత్రి సిఫారసు మేరకు అధ్యక్షుడు నియమిస్తారు. అనంతరం, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రధానితో చర్చించిన తర్వాత నేషనల్ స్ట్రాటజిక్ కమాండ్ అధిపతిని నియమిస్తారు. సైన్యం, వైమానిక, నౌకా దళాల మధ్య సమన్వయం కోసం సీడీఎఫ్ అధిపతిగా ఉంటారు. కాగా, ఈ నెల 28న పదవీ విరమణ చేయనున్న ఆసిఫ్ మునీర్‌ను కొత్తగా సృష్టిస్తోన్న సీడీఎఫ్‌గా నియమించనున్నట్లు పాకిస్తాన్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అదే జరిగితే మునీర్‌కు పాక్ సైన్యంపై మరింత పట్టు పెరుగుతుంది. ఆయనకు మరిన్ని పవర్ వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా.. పహల్గాం దాడి నేపథ్యంలో పాకిస్తాన్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. భారత్ దాడుల కారణంగా పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయింది. పాక్ ఆర్మీకి భారత్ చుక్కలు చూపించింది. అనంతరం, దాడుల నుంచి తేరుకున్న పాక్.. తమ సైన్యంపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ప్రభుత్వం ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌ను ఫీల్డ్ మార్షల్ హోదాకు పదోన్నతి కల్పించింది. తద్వారా ఆయన దేశ చరిత్రలో ఈ పదవికి ఎదిగిన రెండవ అత్యున్నత సైనిక అధికారిగా నిలిచారు. అప్పటి నుంచి షెహబాజ్ ప్రభుత్వం మునీర్‌ను హైలైట్ చేస్తోంది.


