అబద్ధాల బజార్‌లో దోపిడీ దుకాణం | Sakshi
Sakshi News home page

అబద్ధాల బజార్‌లో దోపిడీ దుకాణం

Published Sun, Jul 9 2023 6:07 AM

Congress means loot ki dukaan and jhooth ka bazaar - Sakshi

బికనేర్‌: అవినీతి, అక్రమాలకు మరో రూపమే కాంగ్రెస్‌ పార్టీ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ మరోమారు ఆ పార్టీపై నిప్పులు చెరిగారు. అబద్ధాల బజార్‌లో దోపిడీ దుకాణమే కాంగ్రెస్‌ అన్నారు. ప్రజాగ్రహంతో రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం గద్దెదిగిపోవడం ఖాయమని చెప్పారు. విద్వేష బజార్‌లో ప్రేమ దుకాణం అంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ చేసే వ్యాఖ్యలపై ఆయన ఈ సెటైర్‌ వేశారు. శనివారం ప్రధాని బికనేర్‌ జిల్లా నొరంగ్‌దేశార్‌లో జరిగిన ర్యాలీలో మాట్లాడారు.

అవినీతి, నేరాలు, బుజ్జగింపు రాజకీయాలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం మారుపేరుగా మారిందని ఆరోపించారు. ‘మహిళలపై నేరాల్లో, అత్యాచార ఘటనల్లో రాజస్తాన్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ రక్షకులే వేటగాళ్లుగా మారారు. హత్యలు, అత్యాచార నిందితులను రక్షించుకోవడంలో మొత్తం ప్రభుత్వం నిమగ్నమై ఉంది’అని ప్రధాని విమర్శించారు. ‘కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంటే, దేశాన్ని గుల్ల చేస్తుంది.

అధికారం నుంచి దిగిపోతే విమర్శలతో దేశం ప్రతిష్టను మంటగలుపుతుంది. బీజేపీ కార్యకర్తలు దేశం కోసం సర్వస్వం త్యాగం చేస్తే కాంగ్రెస్‌ నేతలు విదేశాలకు వెళ్లి దేశం పరువు తీస్తారు’ అని ఆరోపించారు. ‘రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే కొందరు మంత్రులు, శాసనసభ్యులు ప్రభుత్వ బంగళాలను ఖాళీ చేసి సొంతిళ్లకు మకాం మార్చినట్లు నాకు సమాచారమొచ్చింది. రాబోయే ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్‌ నేతలకు మాత్రమే నమ్మకం కుదిరింది’ అని ఎద్దేవా చేశారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement