
సమావేశంలో పాల్గొన్న సోనియా, రాహుల్
సాక్షి , న్యూఢిల్లీ: క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం కోసం రాష్ట్ర నాయకులు తమ వ్యక్తిగత ఆకాంక్షలను అధిగమించాలని, క్రమశిక్షణ, ఐక్యత ఎంతో ముఖ్యమని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సూచించారు. ఇటీవల వివిధ రాష్ట్రాల్లో పెరుగుతున్న వర్గపోరును దృష్టిలో పెట్టుకొని... రాష్ట్ర నాయకుల మధ్య సయోధ్య, విధానపరమైన అంశాలపై స్పష్టత, సమన్వయం లోపించిందని ఆమె వ్యాఖ్యానించారు. కీలక అంశాలపై ఏఐసీసీ నుంచి అందే సందేశాలు అట్టడుగు స్థాయికి చేరట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
మంగళవారం కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాహుల్‌గాంధీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సహా అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌లు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పార్టీ సిద్ధాంతాలను రక్షించడమే కాకుండా, అధికార బీజేపీ అసత్య ప్రచారాలను ఎదుర్కొనేందుకు కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడంపై నాయకు లు దృష్టి పెట్టాలని సోనియా సూచించారు.
వచ్చే ఏడాది ప్రారంభంలో జరుగబోయే ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలకు వ్యూహరచన,, నవంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్న పార్టీ సభ్యత్వ నమోదు నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. పారదర్శక పద్ధతిలో పార్టీలో సభ్యులను చేర్పించుకునేందుకు ఇంటింటికి వెళ్ళాలని నేతలకు సోనియా పిలుపునిచ్చారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై ఏఐసీసీ నుంచి వస్తున్న ప్రకటనలు, సందేశాలు క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు చేరట్లేదనేది తన అభిప్రాయమన్నారు.
నవంబర్ 14 నుంచి జన్ జాగరణ్ అభియాన్
దేశంలో పెరుగుతున్న అశాంతి, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, వంటనూనెలతో సహా అనేక ఉత్పత్తుల ధరల పెరుగదల, ఆర్థిక వ్యవస్థ పతనం వంటి అంశాలపై సాధారణ ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు నవంబర్ 14వ తేదీ నుంచి నవంబర్ 29 వరకు దేశవ్యాప్తంగా జన్ జాగరణ్ అభియాన్ అనే పేరుతో ఆందోళనలను చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.