
కేంద్రానికి కొలీజియం సిఫార్సు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ముగ్గురిని సీజేఐ సారథ్యంలోని కొలీజియం సిఫార్సు చేసింది. కర్నాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.అంజరియా, గువాహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విజయ్ బిష్ణోయ్, బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.ఎస్.చందూర్కర్ పేర్లను కేంద్రానికి పంపింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సోమవారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మొత్తం సంఖ్య 34. సీజేఐ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ హృషికేశ్ రాయ్ రిటైర్మెంట్‌తో ఏర్పడ్డ మూడు ఖాళీలను పూరించేందుకు కొలీజియం తాజా సిఫార్సులు చేసింది.
హైకోర్టు సీజేలుగా ఐదుగురు
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా ఐదుగురు న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేస్తూ కొలీజియం మరో నిర్ణయం తీసుకుంది. జస్టిస్ సంజీవ్ సచ్‌దేవను మధ్యప్రదేశ్ హైకోర్టు సీజేగా, జస్టిస్ విభు బక్రూను కర్నాటక హైకోర్టు సీజేగా, జస్టిస్ అశుతోష్ కుమార్‌ను గువాహటి హైకోర్టు సీజేగా, జస్టిస్ విపుల్ మనుబాయి పంచోలీని పట్నా హైకోర్టు సీజేగా, జస్టిస్ తార్లోక్‌సింగ్ చౌహాన్‌ను జార్ఖండ్ హైకోర్టు సీజేగా నియమించాల్సిందిగా కేంద్రానికి సిఫార్సు చేసింది.