
సీఎం పుష్కర్ సింగ్ ధామి వెల్లడి
ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో కుండపోత వానలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో గల్లంతైన వారి కోసం స్నైఫర్ శునకాలు, డ్రోన్లతో సహాయక బృందాల ముమ్మర గాలింపు శుక్రవారం నాలుగో రోజూ కొనసాగింది. ఈ ప్రకృతి విలయానికి ధరాలీ గ్రామం సగానికి సగం సమాధి కావడం తెల్సిందే.
ఈ గ్రామంలోని పలు చోట్ల 50 నుంచి 60 అడుగుల మేర బురద, రాళ్లు పేరుకుపోయాయి. ఇప్పటి వరకు వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన 650 మందిని సహాయక బృందాలు కాపాడాయని సీఎం ధామి శుక్రవారం తెలిపారు. దెబ్బతిన్న సమాచార సంబంధాలను చాలా వరకు పునరుద్ధరించారన్నారు. ఇంటర్నెట్ కనెక్టివిటీ మెరుగైందన్నారు.