సమావేశంపై చర్చిస్తున్న మంత్రులు ఆనంద్, ఆదవ్
మిత్ర పార్టీల అగ్ర నేతలతో నేడు సీఎం విజయ్ కీలక సమావేశం
డీఎంకే వ్యూహాలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా పావులు
ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేసుకునేలా కసరత్తు
వివిధ పార్టీల నేతలను స్వయంగా ఆహ్వానించిన మంత్రులు ఆనంద్, ఆదవ్
సాక్షి, చెన్నై : తమిళనాడులో టీవీకే నేతృత్వంలో కొత్త కూటమి ఏర్పాటు కానుంది. ఈ క్రమంలో సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న మిత్ర పక్ష పార్టీల నేతలతో బుధవారం ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం విజయ్ సమావేశం నిర్వహించనున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలు గెలుచుకున్న అనంతరం.. కాంగ్రెస్, విడుతలై చిరుతైగళ్ కట్చి, సీపీఐ, సీపీఎం, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీల మద్దతుతో విజయ్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రభుత్వంలో వీసీకే, కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌లకు చెందిన ఎమ్మెల్యేలు సైతం మంత్రులుగా ఉన్నారు.
ఈ క్రమంలో డీఎంకే, అన్నాడీఎంకేలు ఇరకాటంలో పెట్టే విధంగా దూకుడు పెంచడంతో సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న పార్టీలను ఏకం చేసి, కొత్త కూటమి దిశగా విజయ్ ప్రయత్నాలు చేస్తున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందులో భాగంగా నేడు జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో ఆ విషయమై చర్చించడంతోపాటు ప్రతిపక్ష పార్టీల ఎత్తుగడలను ఎలా చిత్తు చేయాలనే అంశంపై కూడా చర్చించబోతున్నారు. రాబోయే అసెంబ్లీ ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిగా ఎలా ముందుకు వెళ్లాలనే విషయంతో పాటు ప్రభుత్వం చేపట్టబోయే వివిధ ప్రజా శ్రేయస్సు ప్రాజెక్టుల గురించి కూడా సుదీర్ఘంగా చర్చించనున్నట్లు సమాచారం.
స్టాలిన్ వ్యాఖ్యలతో ప్రాధాన్యత
అసెంబ్లీకి ఎప్పుడైనాఎన్నికలు రావచ్చు అంటూ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు విజయ్‌లో దూకుడు పెంచినట్లు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. నేడు సంకీర్ణ పార్టీల అగ్ర నేతల సమావేశమే ఇందుకు నిదర్శనం అని చెబుతున్నారు. ఈ కీలక సమావేశంలో పాల్గొనాల్సిందిగా సంకీర్ణ కూటమిలోని భాగస్వామ్య పార్టీల నాయకులను ప్రభుత్వ మంత్రులు ఎన్.ఆనంద్, ఆదవ్ అర్జున స్వయంగా కలిసి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో విడుతలై చిరుతైగళ్ కట్చినేత తిరుమావళవ¯Œను నేరుగా కలిసి చర్చించారు. ఆహ్వాన పత్రం అందజేశారు. కూటమిని పటిష్టం చేసుకునే దిశగా సాగుతున్న ఈ పరిణామాలు తమిళ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నాయి.
జూలైలో కరూర్‌కు సీఎం విజయ్
గత సంవత్సరం సెపె్టంబర్ 27న కరూర్‌లో నిర్వహించిన టీవీకే ప్రచార ర్యాలీలో ఊహించని విధంగా జరిగిన భారీ తొక్కిసలాట ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోవడం తెలిసందే. ఆ తర్వాత భద్రతను దృష్టిలో ఉంచుకుని బాధిత కుటుంబాలన్నింటినీ మహాబలిపురంకు పిలిపించి విజయ్ పరామర్శించారు. వారిని ఓదార్చడమే కాకుండా, ప్రతి బాధిత కుటుంబానికి రూ.20 లక్షల చొప్పున ఆర్థి క సహాయం అప్పట్లోనే అందజేశారు. అదే సమయంలో ఎల్లప్పుడూ తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ 41 కుటుంబాల ప్రస్తుత పరిస్థితిని తెలుసుకునేందుకు సీఎం విజయ్ జూలై మొదటి లేక రెండో వారంలో కరూర్‌లో పర్యటించాలని నిర్ణయించారు. ఈ పర్యటన ఏర్పాట్లపై పార్టీ ప్రధాన కార్యదర్శి, మంత్రి ఆనంద్ కరూర్ జిల్లా నేతలతో చర్చించారు.


