చైనా మంజా వాడకంపై ప్రజలకు ఎంత అవగాహన కల్పించిన తీరు మార్చుకోవడం లేదు. పండగ వేళ సరదాగా ఎగరవేసే పతంగులు కొంతమంది పాలిట మృత్యపాశాల్లా మారుతున్నాయి. తాజాగా కర్ణాటకాలో చైనా మాంజాతో తీవ్రగాయాలై ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో పండగ వేళ ఆకుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
సంక్రాంతి పండుగకు గాలిపటాలు ఎగురవేయడం హిందూ సంప్రదాయంలో భాగం. అందుకే దేశవ్యాప్తంగా పెద్ద, చిన్నా తేడా లేకుండా పతంగులు ఎగురవేసి తమ సంతోషాన్ని చాటుకుంటారు. పతంగులు ఎగురవేయడం కోసం వాడే చైనా మాంజా వల్ల ఎంతోమంది ప్రమాదాలకు గురవడంతో పాటు కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. పక్షులసైతం పెద్దఎత్తున మాంజా దారం తగిలి మరణిస్తున్నాయి. దీనిపై ప్రజల్లో ఎంత అవగాహన కల్పించినా తీరుమారడం లేదు.
కర్ణాటక బీదర్ జిల్లా తలమడిగి బ్రిడ్జి వద్ద సంజూ కుమార్ అనే ఓవ్యక్తి బైక్ నడుపుతూ వస్తుండంగా రోడ్డుపై ఉన్న చైనా మంజా అతని ముఖానికి తగిలింది. దీంతో తలకు తీవ్రగాయాలైన సంజూ కుమార్ అక్కడికక్కడే కుప్పకూలారు. అతికష్టంమీద వారి కుమార్తెకు ఫోన్ చేసి జరిగింది చెప్పారు. అంతలోనే అక్కడే ఉన్న స్థానికులు రక్తం ఎక్కువగా పోకుండా కాటన్ గుడ్డ కట్టి అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అయితే అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిన సంజూకుమార్ అంబులెన్స్ వచ్చే సరికే ప్రాణాలు వదిలారు.
అయితే అంబులెన్స్ సమయానికి చేరుకుంటే ఆయన ప్రాణాలు దక్కేవని సంజూ కుమార్ తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా పతంగిలు లేపడానికి చైనా మాంజా వాడకుండా నిషేదం విధించాలని అక్కడే ధర్నా చేపట్టారు. ఇటీవల చైనా మాంజాతో ప్రమాదానికి గురైన ఘటనలు తరచుగా జరుగుతున్నాయి.


