
కేంద్ర రాష్ట్రాలు కలసికట్టుగా సాగాలి: మోదీ
అప్పుడు ఏ లక్ష్యమూ అసాధ్యం కాదు
నీతి ఆయోగ్ భేటీలో సీఎంలకు పిలుపు
రాష్ట్రానికో ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రం
ప్రగతి వేగం పెంచుదామన్న ప్రధాని
న్యూఢిల్లీ: కేంద్రం, రాష్ట్రాలను ‘టీమిండియా’గా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. అవి కలసికట్టుగా పని చేస్తే ఏ అభివృద్ధి లక్ష్యమూ అసాధ్యం కాబోదని ధీమా వెలిబుచ్చారు. శనివారం ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి 10వ భేటీకి ఆయన సారథ్యం వహించారు. వికసిత భారత్–2047 థీమ్‌తో భేటీ సాగింది. 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ప్రతినిధులు భేటీలో పాల్గొన్నట్టు నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యం వెల్లడించారు.
పశ్చిమబెంగాల్, బిహార్, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలు పాల్గొనలేదని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం ముఖ్యమంత్రులతో మోదీ సమావేశమవడం ఇదే తొలిసారి. ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రం ఏర్పాటయ్యేలా కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రధాని సూచించారు. పహల్గాం ఉగ్ర దాడి లక్ష్యాల్లో జమ్మూకశీ్మర్‌లో పర్యాటకాన్ని దెబ్బ తీయడం కూడా ఉన్న నేపథ్యంలో ఈ సూచన ప్రాధాన్యం సంతరించుకుంది. ‘‘ప్రతి గ్రామం, ప్రతి మున్సిపాలిటీ, ప్రతి నగరం, ప్రతి రాష్ట్రమూ ప్రగతి సాధించడమే మన లక్ష్యం కావాలి. అప్పుడు దేశమంతా దానంతటదే వృద్ధి చెందుతుంది.
గడువు లోపలే వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకుంటాం. ఆ దిశగా అభివృద్ధి పనుల వేగం మరింత పెంచుదాం. 140 కోట్ల పైచిలుకు భారతీయుల ఆకాంక్షలను నెరవేరుద్దాం’’ అని రాష్ట్రాలకు ప్రధాని పిలుపునిచ్చారు. భారత్‌లో పట్టణీకరణ శరవేగంగా సాగుతోందని గుర్తు చేశారు. కనుక నగరాలను సుస్థిరాభివృద్ధి, ఇన్నోవేషన్ల కలబోతగా, భవిష్యత్ అవసరాలకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండేలా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం చాలా ఉందన్నారు. ‘‘మహిళా శక్తికి మరింత ప్రాధాన్యమివ్వాలి. అప్పుడే మనమంతా ఆశించిన విధంగా దేశప్రగతి సాధ్యపడుతుంది. శ్రామిక శక్తిలో మహిళలను మరింతగా భాగస్వాములను చేయాలి. అందుకు అనుగుణంగా చట్టాలు, విధానాలను రూపొందించుకోవాలి’’ అని మోదీ చెప్పారు.
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 50 శాతం: సీఎంలు
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 50 శాతానికి పెంచాలని తమిళనాడు, పంజాబ్ ముఖ్యమంత్రులు ఎం.కె.స్టాలిన్, భగవంత్ మాన్ డిమాండ్ చేశారు. ‘‘రాష్ట్రాలకు 41 శాతం వాటా ఇస్తామని మాటిచ్చారు. కానీ 33.16 శాతమే ఇస్తున్నారు. తమిళనాడు దేశంలోకెల్లా అత్యంత పట్టణీకరణ చెందిన రాష్ట్రం. అమృత్ 2.0 పథకం కింద రాష్ట్రానికి ప్రత్యేక పట్టణీకరణ మిషన్‌ను మంజూరు చేయాలని ఎప్పటినుంచో కోరుతున్నాం.
నమామి గంగ తరహాలో తమిళనాడులోని కావేరీ, వైగే తదితర నదుల ప్రక్షాళనకు ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేయాలి’’ అని స్టాలిన్ కోరారు. ఆ ప్రాజెక్టులకు పేర్లను ఇంగ్లిష్లోనే పెట్టాలన్నారు. పంజాబ్‌లో పాకిస్తాన్‌ను ఆనుకుని ఉండే ఆరు సరిహద్దు జిల్లాలకు ప్రత్యేక పారిశ్రామిక ప్యాకేజీ అందించాలని కేంద్రానికి మాన్ విజ్ఞప్తి చేశారు. సరిహద్దు ప్రాంతాల రైతులకు ఇస్తున్న ఎకరాకు రూ.10 వేల పరిహారాన్ని రూ.30 వేలకు పెంచాలన్నారు. సిక్కిం, పశ్చిమబెంగాల్‌లోని సిలిగురిలను కలుపుతూ ప్రపంచస్థాయి జాతీయ రహదారి నిర్మించాల్సిన అవసరం చాలా ఉందని సిక్కిం సీఎం ప్రేంసింగ్ తమాంగ్ అన్నారు.
విధాన అడ్డంకులు తొలగించాలన్నారు: సీఈఓ
భేటీ వివరాలను నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రమణ్యం మీడియాకు వెల్లడించారు. ‘‘వ్యవసాయం, విద్య, వైద్య రంగాలపై మరింతగా దృష్టి సారించాలని రాష్ట్రాలకు ప్రధాని సూచించారు. పెట్టుబడులను మరింతగా ఆకర్షించాలని, తద్వారా ఇతోధికంగా ఉపాధి అవకాశాలను సృష్టించాలని, అందుకోసం విధానపరమైన అడ్డంకులను తొలగించుకోవాలని హితవు పలికారు’’ అని చెప్పారు. భేటీలో పాల్గొన్న సీఎంలు, నేతలు ఆపరేషన్ సిందూర్‌ను ముక్తకంఠంతో సమరి్థంచారన్నారు.
జైరాంతో కాంగ్రెస్‌కే చేటు: బీజేపీ
నీతి ఆయోగ్ ఓ ‘అయోగ్య’ (అసమర్థ) సంస్థ అన్న కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ విమర్శలపై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్‌కే చేటు చేసే వివాదాలను సృష్టించడం ఆయన నైజమని ఎద్దేవా చేసింది. కాంగ్రెస్‌ను జైరాం భూస్థాపితం చేయడం ఖాయమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ జోస్యం చెప్పారు.
నవ్వుల్ పువ్వుల్
ఆయోగ్ భేటీలో సరదా సన్నివేశాలు
ప్రధాని, ముఖ్యమంత్రుల నడుమ పలు సరదా సన్నివేశాలకు నీతి ఆయోగ్ భేటీ వేదికైంది. సమావేశం ముగిశాక రేవంత్‌రెడ్డి, స్టాలిన్ తదితరులతో మోదీ సరదా సంభాషణలు జరిపారు. నవ్వుతూ, వారిని నవి్వస్తూ కని్పంచారు. భగవంత్ మాన్ (పంజాబ్), హేమంత్ సోరెన్ (జార్ఖండ్), కొన్రాడ్ సంగ్మా (నాగాలాండ్) తదితరులు మోదీతో చాలాసేపటిదాకా కరచాలనం చేస్తూ కన్పించారు. వారితో ప్రధాని సరదాగా మాట్లాడారు. ఈ సందర్భంగా నేతలంతా తేనీరు సేవిస్తూ ఉల్లాసంగా గడిపారు.