శాశ్వత మహిళా కమిషన్‌కు కేంద్రం ఓకే

Center Sanctions Permanent Commission to Women Officers - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత సైన్యానికి సంబంధించి నరేంద్ర మోదీ సర్కార్ మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఆర్మీలో మహిళలకు శాశ్వత కమిషన్ మంజూరు చేస్తూ రక్షణ శాఖ గురువారం అధికారిక ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో సైన్యంలో మహిళల ప్రాధాన్యత పెరగడంతోపాటు ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న వాళ్లు ఉన్నత పదవులు పొందడానికి అవకాశం లభిస్తుందని రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. మహిళలకు శాశ్వత కమిషన్ మంజూరు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఆర్మీలోని మొత్తం 10 విభాగాల్లోనూ మహిళలకు సమాన హక్కులు లభిస్తాయి. ఈ ఏడాది ప్రారంభంలో సుప్రీంకోర్టు భారత సైన్యంలో పనిచేస్తున్న మహిళా అధికారులకు కూడా శాశ్వత కమిషన్, కమాండింగ్ రోల్స్ ఇవ్వాల్సిందేనని, దానిపై ఉన్న నిషేధం ఎత్తివేయాలని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. (మహిళా నాయకత్వం చెల్లని చోటు)

భారత సైన్యంలో పనిచేస్తున్న అందరు మహిళాధికారులకు వారు ఎన్ని సంవత్సరాలుగా సర్వీసులో ఉన్నారనే దానితో సంబంధం లేకుండా శాశ్వత కమిషన్ వర్తింపజేయాలని కోర్టు వెల్లడించింది. ఈ ఆదేశాలను మూడు నెలల్లో అమలు చేయాలని సూచించింది. దాంతో కేంద్రం ఎట్టకేలకు మహిళలకు శాశ్వత కమిషన్ మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీని వల్ల ఇకపై ఆర్మీ సర్వీస్ కార్ప్స్, ఆర్డినెన్స్, ఎడ్యుకేషన్ కార్ప్స్, అడ్వకేట్ జనరల్, ఇంజనీర్, సిగ్నల్, ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్-మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌ల్లోకి మహిళలు ప్రవేశించవచ్చు. 

నేటి ఉత్తర్వులతో  బాధిత మహిళా అధికారుల కోసం శాశ్వత కమిషన్ సెలక్షన్ బోర్డును నిర్వహించడానికి ఆర్మీ ప్రధాన కార్యాలయం ఇప్పటికే సన్నాహక చర్యలను ప్రారంభించిందని అధికారులు తెలిపారు. అంతేకాక శిక్షణ, శారీరక ఓర్పు, పోస్టింగ్‌ వంటి అంశాలకు సంబంధింది ప్రస్తుత విధానాలను మార్చేందుకు ఆర్మీ సిద్ధమయ్యింది. త్వరలోనే బాధిత మహిళా అధికారులు అందరికి తమ ఆప్షన్‌ను వినియోగించుకుని, అవసరమైన డాక్యుమెంటేషన్‌ను పూర్తి చేసే అవకాశం కల్పిస్తామని సెలక్షన్‌ బోర్డు తెలిపింది. మెడికల్ కార్ప్స్, డెంటల్ కార్ప్స్, మిలిటరీ నర్సింగ్ సర్వీసులను మినహాయించి ఇప్పటివరకు భారత సైన్యంలో మహిళలు కేవలం 3.89 శాతం ఉండగా, నేవీలో 6.7 శాతం, వైమానిక దళంలో 13.28 శాతం మాత్రమే ఉన్నారు.(నేవీలో మహిళలకు శాశ్వత కమిషన్‌)

ఇప్పటివరకు ఆర్మీలో మహిళల ప్రవేశం షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సి) ద్వారా మాత్రమే జరిగింది. అయితే వారు 14 సంవత్సరాలకు మించి సేవ చేయలేకపోయారు. అయినప్పటికీ, కొంతమందికి పొడిగింపులను కొనసాగించారు. కాని వారికి శాశ్వత కమిషన్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఆర్మీలో 300 మందికి పైగా మహిళా అధికారులుకు 14 ఏళ్ల సర్వీస్‌ పూర్తయ్యింది. వీరంతా ప్రస్తుతం పొడిగింపుపై పనిచేస్తున్నారు. మాతృత్వం, శారీరక పరిమితి, పిల్లల సంరక్షణ, గ్రామీణ నేపథ్యాల వంటి అంశాలను సాకుగా చూపుతూ మహిళలను కమాండ్ స్థాయి పదవులకు తీసుకోలేదు. ప్రస్తుత నిర్ణయంతో ఈ అడ్డంకి తొలగిపోనుంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top