నేవీలో మహిళలకు శాశ్వత కమిషన్‌ | Sakshi
Sakshi News home page

నేవీలో మహిళలకు శాశ్వత కమిషన్‌

Published Wed, Mar 18 2020 3:07 AM

Supreme Court Clarifies That Permanent Commission Should Be set Up For Female Employees Of The Navy - Sakshi

న్యూఢిల్లీ: భారత నావికా దళంలోని మహిళా ఉద్యోగుల కోసం శాశ్వత కమిషన్‌ ఏర్పాటు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ‘పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు కల్పించాలి. వివక్షను అధిగమించేందుకు మహిళలకు అవకాశం కల్పించిన సందర్భాలు చరిత్రలో అనేకం ఉన్నాయి’అని వ్యాఖ్యానించింది. నేవీలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ ఏర్పాటు కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం.. ‘సాయుధ దళాల్లో లింగ సమానత్వ విధానం అమలుకు 101 సాకులు చూపడం సమాధానం కాదు. సామర్థ్యం, పోటీతత్వం ఆధారంగా బాధ్యతలను అప్పగిస్తే వారికి వివక్షను అధిగమించే అవకాశం ఇచ్చినట్లవుతుంది. మహిళా అధికారుల కోసం శాశ్వత కమిషన్‌ ఏర్పాటు చేయకపోవడం అన్యాయమే అవుతుంది’అని వ్యాఖ్యానించింది. నేవీలో మహిళా అధికారులు చూపిన ధైర్యసాహసాలు, చేసిన త్యాగాలు మరువలేనివన్న కోర్టు..‘1991, 1998ల్లో కేంద్రం ప్రకటించిన విధానాల ప్రకారం నేవీలో మహిళలను నియమించుకోవచ్చు. వారిని పురుష అధికారులతో సమానంగా పరిగణించాల్సిందే’అని తెలిపింది.

కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ సంజయ్‌ వాదనలు వినిపించారు. సముద్రంలో కొన్ని విధులు నిర్వహించేందుకు అవసరమైన శారీరక సామర్థ్యం పురుషులతో పోలిస్తే మహిళల్లో తక్కువన్నారు. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌ మాదిరిగా కాకుండా నేవీ సిబ్బంది నెలలపాటు సముద్రంలోనే విధుల్లో ఉంటారని, అందుకే మహిళలను తీసుకోవడం లేదన్నారు. రష్యా నుంచి కొనుగోలు చేసే నౌకల్లో మహిళల కోసం టాయిలెట్ల వంటి సదుపాయాలు లేనందునే వారికి విధులు అప్పగించడం లేదని వివరించారు. ఈ వాదనలను ధర్మాసనం తప్పుబట్టింది.  మహిళల కోసం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. ఇందుకు సంబంధించిన విధివిధానాలను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. నేవీలోని కొన్ని విభాగాల్లో మహిళలను నియమించరాదంటూ 2008లో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయరాదని ధర్మాసనం ఆదేశించింది. షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ)లోని విద్య, న్యాయం, రవాణా విభాగాల్లో ప్రస్తుతం విధులు నిర్వర్తించే వారందరికీ శాశ్వత కమిషన్‌ వర్తిస్తుందని స్పష్టంచేసింది. 2008కి ముందు విధుల్లో చేరి శాశ్వత కమిషన్‌ లేకపోవడంతో నష్టపోయిన మహిళా అధికారులు.. రిటైరైన తర్వాత అందే పింఛను ప్రయోజనాలను పొందవచ్చని తెలిపింది.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement