న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత ప్రస్తుతం మన జీవితాల్లో ఒక ముఖ్య భాగమైపోయింది. కోడింగ్ నుండి స్క్రిప్ట్ రైటింగ్ వరకు అన్ని రంగాల్లోనూ దీని వాడకం విపరీతంగా పెరిగింది. అయితే, ఇటీవల కాలంలో చాలా మంది తమ ఆరోగ్య సమస్యలకు, స్వీయ వైద్య నిర్ధారణ కోసం చాట్‌జీపీటీ వంటి ఏఐ సాధనాలను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘వైద్య సలహాల కోసం ఏఐని ఎంతవరకు నమ్మవచ్చు?’ అనే అంశంపై పెన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు ఒక కీలక అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ పరిశోధనలో ఏఐ సామర్థ్యానికి సంబంధించి పలు ఆశ్చర్యకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి.
పరిశోధన వెనుక..
పరిశోధన బృంద సభ్యుడు, పెన్ స్టేట్ అసోసియేట్ ప్రొఫెసర్ అమూల్య యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం... ప్రజలు తమ ఆరోగ్య సమస్యలను తెలుసుకోవడానికి చాలా కాలంగా గూగుల్ వంటి సెర్చ్ ఇంజన్లను వాడుతున్నారు. అయితే, అధునాతన ఏఐ చాట్‌బాట్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఇవి ఆన్‌లైన్ స్వీయ వైద్య నిర్ధారణ సాధనాలుగా మారగలవా లేదా అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఈ అధ్యయనం చేపట్టారు. ఈ ఏఐ టూల్స్ ప్రజలకు నిజంగా ఉపయోగకరంగా మారతాయా లేక మరింత సమస్యాత్మకంగా పరిణమిస్తాయా అని విశ్లేషించడమే ఈ పరిశోధన ముఖ్య ఉద్దేశం.
76 శాతం ఖచ్చితత్వం.. చాట్‌జీపీటీ టాప్!
ఈ అధ్యయనంలో భాగంగా పరిశోధకులు వినియోగదారుల నుండి 200కు పైగా ఆరోగ్య సంబంధిత ప్రశ్నలను సేకరించి, వాటిని చాట్‌జీపీటీతో సహా వివిధ రకాల లాంగ్వేజ్ మోడల్స్‌కు అందించారు. ఆ ఏఐ సాధనాలు ఇచ్చిన సమాధానాలను బోర్డ్-సర్టిఫైడ్ వైద్యులు నిశితంగా పరిశీలించారు. ఈ విశ్లేషణలో ఏఐ టూల్స్ దాదాపు 76 శాతం మేర సరైన సమాధానాలనే ఇచ్చాయని తేలింది. వీటిలో అన్నింటికంటే ముఖ్యంగా ఓపెన్ ఏఐ కి చెందిన చాట్‌జీపీటీ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, ఖచ్చితమైన ఫలితాలను అందించినట్లు ప్రొఫెసర్ అముల్య యాదవ్ పేర్కొన్నారు.
వైద్యులు లేని చోట వరం.. కానీ హెచ్చరిక తప్పదు!
ప్రపంచ జనాభాలో దాదాపు సగం మందికి సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేవని అంచనా. అలాంటి ప్రాంతాల్లో వైద్యులు అందుబాటులో లేనప్పుడు, 76 శాతం ఖచ్చితత్వంతో పనిచేసే ఈ ఏఐ మోడల్స్ కొంతవరకు సహాయపడగలవని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, వైద్య నిర్ణయాల కోసం పూర్తిగా ఏఐ పైనే ఆధారపడకూడదని వారు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఏఐ చాట్‌బాట్లు ప్రస్తుతానికి మానవ వైద్యులంత ఖచ్చితమైనవి కావని, లక్షణాలను సరిగ్గా అంచనా వేయడంలో, తప్పుడు సమాచారాన్ని గుర్తించడంలో వైద్యులే అత్యంత సమర్థులని అమూల్య యాదవ్ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: సీబీఎస్‌ఈ పోర్టల్‌పై హ్యాకర్ల అటాక్.. తిప్పికొట్టిన టెక్ టీమ్!


