
స్తంభించిన పార్లమెంట్ ఉభయ సభలు
బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై వెనక్కి తగ్గని విపక్షాలు
లోక్‌సభ, రాజ్యసభ సోమవారానికి వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో వర్షాకాల సమావేశాల్లో గందరగోళానికి ఇంకా తెరపడలేదు. విపక్ష సభ్యు లు ఆందోళనలు, నిరసనలు, నినాదాల కారణంగా వరుసగా ఐదో రోజు శుక్రవారం సైతం ఉభయ సభలు స్తంభించాయి. పలుమార్లు వాయిదా పడ్డాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల సంఘం ప్రారంభించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై విపక్షాలు మండిపడ్డాయి.
దీనిపై పార్లమెంట్‌లో వెంటనే చర్చించాలని, కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశాయి. నినాదాలతో హోరెత్తించాయి. ప్రతిపక్షాల ఆగ్రహావేశాల వల్ల పరిస్థితి చెయ్యి దాటిపోతుండడంతో లోక్‌సభ, రాజ్యసభను సోమవారానికి వాయిదా వేస్తుతన్నట్లు సభాపతులు ప్రకటించారు. చెప్పుకోదగ్గ కార్యకలాపాలేవీ జరగకుండానే వర్షాకాల సమావేశాల్లో తొలివారం ముగిసిపోవడం గమనార్హం.
లోక్‌సభలో నినాదాల హోరు
లోక్‌సభ శుక్రవారం ఉదయం ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు ప్రారంభించారు. స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. దీనిపై చర్చకు విపక్ష సభ్యులు అడ్డుతగిలారు. చేసేది లేక స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. విపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు.
ఓటర్ల జాబితా సవరణపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, విపక్షాలు సహకరించాలని స్పీకర్ స్థానంలో ఉన్న జగదాంబికా పాల్ కోరారు. అయినా విపక్ష సభ్యులు వినిపించుకోలేదు. ఇప్పడే చర్చ ప్రారంభించాలని తేల్చిచెప్పారు. వారిపై జగదాంబికా పాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల సమస్యలపై చర్చించాల్సి సభలో ఈ అలజడి ఏమిటని ప్రశ్నించారు. దీనివల్ల ఎవరికీ ఉపయోగం ఉండదని అన్నారు.
సభ వాయిదా పడేలా చేయడం గొప్ప విషయం కాదని హితవు పలికారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగకపోతే దేశమే నష్టపోతుందని చెప్పారు. చర్చించాల్సిన బిల్లులు చాలా ఉన్నాయని, సహకరించాలని ప్రతిపక్షాలను కోరారు.
గోవాలో ఎస్టీలకు అసెంబ్లీ స్థానాలు కేటాయించేందుకు ఉద్దేశించిన కీలకమైన బిల్లుపై చర్చిద్దామని న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ చెప్పారు. అయినా విపక్షాల తీరులో మార్పు రాలేదు. దీంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు జగదాంబికా పాల్ ప్రకటించారు. ‘కార్గిల్ విజయ్ దివస్’ నేపథ్యంలో కార్గిల్ అమర వీరులకు లోక్‌సభలో నివాళులర్పించారు. ఎంపీలంతా కొంతసేపు మౌనం పాటించారు.
‘ఓటు చోరీ బంద్ కరో’
పార్లమెంట్ ఎగువ సభలోనూ విపక్షాల ఆందోళన యథాతథంగా కొనసాగింది. వివిధ అంశాలపై రూల్ 267 కింద చర్చను కోరుతూ విపక్షాలు ఇచ్చిన 28 నోటీసులను తిరస్కరిస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ చెప్పారు. బిహార్‌లో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అంశాన్ని ప్రతిపక్ష ఎంపీలు లేవనెత్తారు. దీనిపై సభలో తక్షణమే చర్చించాలని పట్టుబట్టారు. ఉదయం రాజ్యసభ మొదలైన వెంటనే నినాదాలు మిన్నంటడడంతో రఘువంశ్ సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు.
వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్‌పై బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సమాధానం ఇస్తుండగా ప్రతిపక్ష ఎంపీలు బిగ్గరగా కేకలు వేశారు. బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణను ఆపాలని డిమాండ్ చేశారు. ‘ఓటు చోరీ బంద్ కరో’ అంటూ నినదించారు. కొందరు ఎంపీలు వెల్‌లోకి ప్రవేశించారు. వెనక్కి వెళ్లిపోవాలని, సభకు సహకరించాలని సభాపతి స్థానంలో ఉన్న బీజేపీ ఎంపీ ఘన్‌శ్యామ్ తివారీ పదేపదే విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోలేదు. దాంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ఘన్‌శ్యామ్ తివారీ ప్రకటించారు.
కమల్ హాసన్ ప్రమాణం
ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం(ఎంఎన్‌పీ) పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ శుక్రవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు డీఎంకే నాయకులు రాజాత్తి, ఎస్.ఆర్.శివలింగం, పి.విల్సన్ సైతం ఎగువ సభ సభ్యులుగా ప్రమాణం చేశారు.
విపక్షాల నిరసన
బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్‌ఐఆర్)ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ విపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపీలు పా ర్లమెంట్ ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించారు. మకరద్వారం మెట్లపై వినూ త్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఎస్‌ఐఆర్ అని రాసి ఉ న్న పత్రాలను చించివేసి, చెత్తకుండీలో విసి రేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నా రు. ఎస్‌ఐఆర్‌పై పార్లమెంట్‌లో చర్చించాలని తేల్చిచెప్పారు.
సభకు సహకరించడానికి విపక్షాల అంగీకారం
నిరసనలు, నినాదాలు పక్కనపెట్టి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇకపై సజావుగా సాగేందుకు సహకరిస్తామని ప్రతిపక్ష నేతలు చెప్పారు. వర్షాకాల సమావేశాల్లో నిత్యం గందరగోళ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం అన్ని పార్టీల సీనియర్ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సభా కార్యకలాపాలకు సహకరించాలని కోరగా, ప్రతిపక్ష నాయకులు అందుకు అంగీకరించినట్లు పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. సోమవారం నుంచి నిర్మాణాత్మక చర్చలు సాగిద్దామని స్పీకర్ సూచించారు. ప్రజలకు మేలు కలిగేలా సభలో అర్థవంతమైన చర్చలు జరగాలన్నదే తన ఉద్దేశమని ఆయన వివరించారు. ఆపరేషన్ సిందూర్‌పై సోమవారం పార్లమెంట్‌లో చర్చ ప్రారంభం కానుంది.