యూపీలోని అయోధ్య ఎంపీ అవధేష్ ప్రసాద్ తాజాగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. సమాజ్ వాదీ పార్టీ నేత అయిన ఎంపీ అవధేష్ ప్రసాద్ తాను రాముని దయతో ఎంపీగా ఎన్నికయ్యానని అన్నారు. రాముణ్ణి తీసుకొచ్చింది తామేనని బీజేపీ చెబుతున్నప్పటికీ, రాముని ఆశీస్సులు తనకే అందాయని అవధేష్ అన్నారు.
అయోధ్య ఎవరి వారసత్వం కాదని, ఇది శ్రీరాముని జన్మ భూమి అని, తామే నిజమైన రామభక్తులమని అవధేష్ పేర్కొన్నారు. ఇక్కడి ప్రజలు.. అహంకారులను ఓడించారని అన్నారు. నీట్ పరీక్షల గురించి మాట్లాడిన ఆయన బీజేపీ ప్రభుత్వం లీక్‌లు లేకుండా ఏ పరీక్షనూ నిర్వహించలేకపోతున్నదన్నారు.
అయోధ్య ఎంపీగా ఎన్నికైన తర్వాత అవధేష్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అయోధ్యలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అవధేష్ ప్రసాద్ 54,567 ఓట్లతో విజయం సాధించారు. ఆయనకు మొత్తం 5,54,289 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్‌కు 4,99,722 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ అభ్యర్థి సచ్చిదానంద్ పాండే 46,407 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
