లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం, దివంగత ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. తన భార్య అపర్ణ యాదవ్‌తో వేగలేక ఆమె నుంచి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఇన్‌స్టాలో పోస్టు పెట్టారు.
ప్రతీక్ ఇన్‌స్టాగ్రామ్‌లో అపర్ణ చిత్రాన్ని పోస్ట్ చేసి.. ఆమెను ఫ్యామిలీ డిస్ట్రాయర్‌గా అభివర్ణించారు. ‘నా భార్య అపర్ణ యాదవ్ (బీజేపీ నేత)కు విడాకులు ఇస్తున్నాను. అపర్ణ యాదవ్ నా కుటుంబంలో చిచ్చు పెట్టింది. నా కుటుంబాన్ని నాశనం చేసింది.
ఇలా స్వార్థంగా ఆలోచించే మహిళ నుంచి వీలైనంత త్వరగా విడాకులు తీసుకుంటాను. ఆమె నా కుటుంబ సంబంధాలను నాశనం చేసింది. ఆమె ఫేమస్ అవ్వాలని, ఇతరులను ఇన్‌ఫ్లయిన్స్ చేయాలని కోరుకుంటుంది. నాకు నా మానసిక స్థితిపై ఆందోళనగా ఉంది. అలా అని ఆమె నాకోసం బాధపడదు. తన కోసం తాను మాత్రమే బాధపడుతుంది. ఇలాంటి వ్యక్తిని నేను ఇంత వరకు చూడలేదు. ఆమెను వివాహం చేసుకోవడం నా దురదృష్టం’ అని ప్రతీక్ అన్నారు.
ప్రతీక్, అపర్ణ 2011లో వివాహం చేసుకున్నారు వారికి ఒక కుమార్తె ఉంది. అయితే, అపర్ణ సోదరుడు అమన్ బిష్ట్ .. ప్రతీక్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైనట్లు చెప్పారు.
ప్రారంభంలో సమాజ్‌వాదీ పార్టీలో ఉన్న అపర్ణ 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ జోషి చేతిలో ఓడిపోయారు. 2022లో ఆమె జాతీయ వాదం కారణం చూపుతూ బీజేపీలో చేరారు. ఆమె ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు.
అపర్ణ యాదవ్, ములాయం సింగ్ యాదవ్‌కు కోడలుగా రాజకీయాల్లో కూడా చురుకుగా వ్యవహరించారు. అయితే, ఆమె బీజేపీలో చేరిన తర్వాత యాదవ్ కుటుంబంలో అసంతృప్తి పెరిగింది. ఇప్పుడు విడాకుల కేసు దాఖలు కావడంతో ఆ విభేదాలు మరింత స్పష్టమయ్యాయి. ఈ కేసు రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. యాదవ్ కుటుంబం ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఈ విడాకుల కేసు ఆ కుటుంబ ప్రతిష్టపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.


