వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందిస్తున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు
పార్లమెంటరీ పార్టీ భేటీలో ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం
రాష్ట్ర ప్రజల సమస్యలను పార్లమెంట్ ఉభయ సభలలో బలంగా ప్రస్తావించాలి
హక్కుల అణచివేతపై ఎలుగెత్తాలి.. భయంకరమైన రుణభారంలో ఏపీ.. యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన
అత్యంత ఆందోళనకరంగా శాంతి భద్రతలు
రెడ్ బుక్ పాలనతో రాజకీయ కక్ష సాధింపులు
చంద్రబాబు సర్కారు అన్యాయాలను ఎండగట్టాలి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన ప్రతి ముఖ్యమైన సమస్యను పార్లమెంట్ వేదికగా ఉభయ సభలలో సమర్థవంతంగా.. ధైర్యంగా లేవనెత్తాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తమ పార్టీ ఎంపీలకు సూచించారు. రాష్ట్ర ప్రజల కష్టాలు, సమస్యలు, ఆకాంక్షలను జాతీయ స్థాయిలో వినిపించే బాధ్యత వైఎస్సార్‌సీపీ ఎంపీలదేనని గుర్తుచేశారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి వైఎస్సార్‌సీపీ ఎంపీలు హాజరయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పార్లమెంటు ఉభయసభలలో వ్యవహరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ... రాష్ట్రంలో రైతులు, యువత, మహిళలు, కార్మీకులు, పేదలు, బడుగు–బలహీన వర్గాల ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని, ఆయా వర్గాలకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలు, అన్యాయం, నిర్లక్ష్యాన్ని పార్లమెంట్ వేదికగా ఎండగట్టాలని ఎంపీలకు సూచించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలన్నింటినీ టీడీపీ కూటమి సర్కారు నిర్విర్యం చేయడం, ప్రజల హక్కులను కాలరాస్తున్న తీరును కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నారు.
దీంతోపాటు రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని, అప్పులు చేయడంలో యథేచ్ఛగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని, దీంతో ఏపీ భయంకరమైన రుణభారంలో కూరుకుపోతుండటాన్ని ప్రస్తావించాలని సూచించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారిందని వైఎస్ జగన్ పేర్కొన్నారు. టీడీపీ అమలు చేస్తున్న రెడ్‌బుక్ పాలన కారణంగా రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపులు పెరిగిపోయాయని, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులపై దాడులు, అక్రమ కేసులు, వేధింపులు కొనసాగుతున్నాయన్నారు.
ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ హక్కులను టీడీపీ కూటమి నాయకులు కాలరాస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల పల్నాడు జిల్లాలో వైఎస్సార్‌సీపీకి చెందిన దళిత కార్యకర్త మందా సాల్మన్‌పై జరిగిన దాడి, హత్య ఘటనను ప్రస్తావించిన వైఎస్ జగన్.. రాష్ట్రంలో దళితులపై దాడులు, అక్రమ కేసులు, వేధింపులు రోజురోజుకీ పెరుగుతున్నాయని, ఈ ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
న్యాయం జరిగే వరకు పోరాటమే..
ఏపీలో దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలపై జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్‌ను కలసి సమగ్ర నివేదికతో వినతిపత్రం అందజేయాలని పార్టీ ఎంపీలను వైఎస్ జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, హత్యలు, వేధింపులపై రాజ్యాంగబద్ధ సంస్థలు తక్షణమే స్పందించి జోక్యం చేసుకోవాలన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపవద్దని ఎంపీలకు స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్‌ను ఒక శక్తివంతమైన వేదికగా ఉపయోగించుకోవాలని, కేంద్రంపై నిరంతర ఒత్తిడి తెచ్చే విధంగా పని చేయాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. వైఎస్సార్‌సీపీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని.. ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం అంకితభావంతో పని చేస్తుందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.


