సస్పెన్స్‌కు తెర.. బీజేపీకి అన్నామలై గుడ్‌బై | BJP Accepts Annamalai Registration | Sakshi
Sakshi News home page

సస్పెన్స్‌కు తెర.. బీజేపీకి అన్నామలై గుడ్‌బై

Jun 5 2026 10:51 AM | Updated on Jun 17 2026 5:54 PM

BJP Accepts Annamalai Registration

సాక్షి, న్యూఢిల్లీ: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ నేత, రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావశీల నాయకుడిగా పేరున్న అన్నామలై పార్టీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించినట్లు సమాచారం.

పార్టీతో నెలకొన్న విభేదాల నేపథ్యంలో అన్నామలై రాజీనామా చేయబోతున్నారని కొన్నాళ్లుగా ప్రచారం సాగుతోంది. దీంతో హైకమాండ్‌ ఆయన్ని ఢిల్లీకి పిలిపించుకుని భేటీలు జరిపింది. అయితే ఆయనను బుజ్జగించేందుకు కేంద్ర నాయకత్వం చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు తెలుస్తోంది. అంతర్గతంగా జరిగిన చర్చలు ఫలించకపోవడంతో ఆయన రాజీనామాను ఆమోదించాల్సిన పరిస్థితి వచ్చింది.

బిజెపి సభ్యత్వానికి అన్నామలై  చేసిన రాజీనామాను జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆమోదించారని.. బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ అధికారికంగా వెల్లడించారు. 

కే అన్నామలై.. తమిళనాడు రాజకీయాల్లో గత కొన్నేళ్లలో వేగంగా ఎదిగిన యువ నాయకుల్లో ఒకరు. 1984 జూన్‌ 4న జన్మించిన ఆయన.. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన తర్వాత సివిల్స్‌లో ర్యాంక్‌ కొట్టారు. 2011 బ్యాచ్ ఐపీఎస్‌ అధికారిగా కర్ణాటకలో విధులు నిర్వహించారు. కఠినమైన, నిష్పాక్షిక అధికారిగా గుర్తింపు పొందిన ఆయన, కొంతకాలానికి తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు.

అలా మొదలైంది.. 
2020 ఆగస్టులో బీజేపీలో చేరడం ఆయన రాజకీయ ప్రయాణంలో కీలక మలుపుగా నిలిచింది. పార్టీలో చేరిన తక్కువ కాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన నాయకుడిగా గుర్తింపు పొందారు. యువతను ఆకర్షించే ప్రసంగాలు, క్షేత్రస్థాయి పర్యటనలతో తమిళనాడులో బీజేపీకి కొత్త ఊపు తెచ్చే ప్రయత్నం చేశారు. 

2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అరవకురిచ్చి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడారాయన. అయితే ఆ ఫలితంతో సంబంధం లేకుండా.. అదే ఏడాది ఆయనను తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ విస్తరణపై దృష్టి పెట్టి, డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీని నిలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే.. 

నొచ్చుకుని..
రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ స్థిరమైన పట్టు సాధించడంలో సవాళ్లు ఎదురయ్యాయి. ఆపై లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీ చేసి ఓడారాయన. అయినప్పటికీ ఆయన వ్యక్తిగత ఇమేజ్, దూకుడు నాయకత్వం తమిళనాడు రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. 

అన్నామలై.. గత కొంతకాలంగా పార్టీ నిర్ణయాలపై అసంతృప్తిగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడిచింది. మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో అన్నాడీఎంకే పొత్తును ఆయన వద్దన్నారని.. ఆ ఎఫెక్ట్‌తోనే(పళనిస్వామి ఒత్తిడితోనే) ఆయన్ని బీజేపీ స్టేట్‌ చీఫ్‌ పదవి నుంచి తప్పించారని గుసగుసలు వినిపించాయి. ఆ తర్వాత ఆయనకు అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఇవ్వకపోగా.. ఎన్నికల ప్రచారంలోనూ ఆయన క్రియాశీలకంగా కనిపించలేదు. 

ఈ క్రమంలో ఎన్నికల తర్వాత ఆయన బీజేపీని వీడబోతున్నారని ప్రచారం మొదలైంది. అయితే ఆ వార్తలను తమిళనాడు బీజేపీ యూనిట్‌ తోసిపుచ్చుతూ వచ్చింది. మరోవైపు.. అన్నామలైని వదులుకోకూడదని మంచిది కాదని ఆరెస్సెస్‌ బీజేపీకి సూచిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఢిల్లీ పెద్దలు ఆయనతో చర్చించారు. అయితే ఆ చర్చలు విఫలం కావడంతో తాజాగా ఆయన రాజీనామాను ఆమోదించింది.

ఇక అన్నామలై తదుపరి అడుగు ఏమిటన్నదానిపై ఆసక్తి నెలకొంది. ఆయన త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అదే జరిగితే.. తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీయవచ్చని అంచనా. మొత్తంగా, అన్నామలై రాజీనామాతో తమిళనాడు బీజేపీకి పెద్ద దెబ్బ తగిలినట్లుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement