ఎగ్మోర్ రైల్వే స్టేషన్
ఆధునీకరణ పనులు
రైల్వే యంత్రాంగం నిర్ణయం
సాక్షి, చైన్నె: చైన్నె ఎగ్మోర్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనుల కారణంగా, ఎక్స్‌ప్రెస్ రైళ్లను మళ్లీ తాంబరం నుంచే నడిపించాలని రైల్వే పరిపాలనా విభాగం నిర్ణయించింది. చైన్నె ఎగ్మోర్ రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చేయాలని దక్షిణ రైల్వే నిర్ణయించింది. ఇందులో భాగంగా రూ. 734.91 కోట్ల వ్యయంతో 2023 ఫిబ్రవరిలో పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా ఎగ్మోర్ రైల్వే స్టేషన్‌లోని మొదటి 5 ప్లాట్‌ఫారమ్‌లను వెడల్పు చేసి ఆధునీకరించే పనుల కోసం, రైళ్లను తాంబరం స్టేషన్‌కు మార్చే ప్రక్రియ గత ఏడాది జూన్‌లో ప్రారంభమైంది. ఆ తర్వాత సెప్టెంబర్, డిసెంబర్ నెలల్లో దశల వారీగా ఇతర ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా తాంబరం టెర్మిన ల్‌కు మార్చారు. ఆ తర్వాత, ఎగ్మూర్ స్టేషన్‌లోని 1వ ప్లాట్‌ఫారమ్ నుండి 11వ ప్లాట్‌ఫారమ్ వరకు అనుసంధానించేలా భారీ వంతెన నిర్మాణ మొదటి విడత పనులు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమయ్యాయి. దీంతో ఉళవన్, అనంతపురి, రామేశ్వరం వంటి కొన్ని ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఫిబ్రవరి 3 నుండి ఏప్రిల్ 4 వరకు తాత్కాలికంగా తాంబరం స్టేషన్‌కు మార్చి అక్కడ నుంచే నడిపారు. ఇవే కాకుండా, సబర్బన్ (సబర్బన్ ఎలక్ట్రిక్) రైళ్ల సేవల్లో కూడా ఫిబ్రవరి 20 నుండి ఏప్రిల్ 3 వరకు 43 రోజుల పాటు తాత్కాలిక మార్పులు చేశారు. ఆ తర్వాత ముఖ్యమైన పనులు పూర్తి కావడంతో, ఎగ్మోర్ స్టేషన్ నుండి ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలు యథావిధిగా సాగుతూ వస్తున్నాయి. ఈ పరిస్థితిలో, 3వ విడతగా ఇనుప వంతెన నిర్మాణ పనుల నిమిత్తం కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను మళ్లీ తాంబరానికి మార్చాలని నిర్ణయించారు.
తాంబరం రైల్వే స్టేషన్
మళ్లీ తాంబరంకు మార్పు..
ఈ వంతెన నిర్మాణం కోసం 500 టన్నులకు పైగా బరువున్న క్రేన్లను ఉపయోగించి ఇనుప గర్డర్లను అమర్చనున్నారు. ఈ వంతెన 18 మీటర్ల వెడల్పు, 120 మీటర్ల పొడవుతో రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం గాంధీ ఇర్విన్ రోడ్డు వైపు ఉన్న 1 నుండి 5 ప్లాట్‌ఫారమ్‌ల వరకు ఇనుప వంతెన అమర్చనున్నారు. దీనిని వరుసగా 6 నుండి 11 ప్లాట్‌ఫారమ్‌ల వరకు పొడిగించే పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ కారణంగా ఎగ్మోర్ నుండి నడిచే ఎక్స్‌ప్రెస్ రైళ్లను మళ్లీ తాంబరానికి మార్చాలని నిర్ణయించారు. దీనిపై రైల్వే అధికారులు మాట్లాడుతూ వంతెన నిర్మాణ పనుల వలన కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను తాంబరానికి మార్చే విషయమై దక్షిణ రైల్వే ప్రధాన కార్యాలయానికి ప్రతిపాదనలు పంపినట్టు వివరించారు. అనుమతి వచ్చిన వెంటనే ఈ మార్పులు అమలులోకి వస్తాయన్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రైలు సేవల్లో మార్పులు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సబర్బన్ రైళ్లను 5, 6 ప్లాట్‌ఫారమ్‌ల నుండి నడపడంపై కూడా ఆలోచిస్తున్నామని తెలిపారు. కాగా, దక్షిణ చైన్నె వైపుగా ఉన్నతాంబరం ప్రస్తుతం మూడో రైల్వే టెర్మినల్‌గా రూపుదిద్దుకుంది. ఇక్కడి నుంచే దక్షిణ తమిళనాడు వైపుగా సాగే అనేక రైళ్లు బయలు దేరుతున్నాయి. తాజాగా ఎక్స్‌ప్రెస్ రైళ్లు అన్నీ ఇక్కడి నుంచే సేవలు మళ్లీ మొదలెట్టిన పక్షంలో ఆ పరిసరాలు కిటకిటాలడాల్సిందే.


