కావేరి రచ్చ! | - | Sakshi
Sakshi News home page

కావేరి రచ్చ!

Jul 29 2026 12:46 AM | Updated on Jul 29 2026 12:46 AM

● కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో భగ్గుమన్న నేతలు

సాక్షి, చైన్నె : తమిళనాడులో కావేరి జల వివాదం రచ్చ మళ్లీ తెరపైకి వచ్చింది. రాజ్యసభలో జల శక్తి శాఖ సహాయ మంత్రిసహాయ మంత్రి రాజ్‌భూషణ్‌ వ్యాఖ్యలతో తమిళనాట నేతలలో ఆగ్రహం బయలు దేరింది. కావేరి విషయంలో తమిళనాడుకు వ్యతిరేకంగా పెద్ద కుట్ర జరుగుతున్నట్టుగా తమిళ పార్టీలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. రైతు సంఘాలు సైతం అగ్గి మీదు బుగ్గిలా శివాలెత్తుతున్నాయి. వివరాలు.. తమిళనాడు – కర్ణాటక మధ్య కావేరి జల వివాదం గురించి తెలిసిందే.గతంలో కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఏటా 177 టీఎంసీల నీటిని తమిళనాడుకు కర్ణాటక విడుదల చేయాల్సి ఉంది. గత డీఎంకే పాలనలో నైరుతీ రుతు పవనాలు సజావుగా పడటంతో కర్ణాటక నుంచి కావేరి పరవళ్లు తొక్కింది. గత నాలుగేళ్లుగా నిర్ణీత జూన్‌ 12వ తేదీన మేట్టూరు డ్యాం నుంచి నీటిని కురువై సాగు నిమిత్తం విడుదల చేశారు. అయితే, తమిళనాట అధికార మార్పు నేపథ్యంలో ఈ ఏడాది కురువైకు నీళ్లు కరువైంది. కర్ణాటక నుంచి వాటాగారావాల్సిన నీళ్లు ఇంత వరకు విడుదల కాలేదు. అదే సమయంలో కావేరి తీరంలోని మేఘదాతు వద్ద జలాశయం నిర్మాణానికి కర్ణాటక ప్రయత్నాలు విస్తృతం చేస్తుండటంతో తాజాగా ఆగ్రహావేశాలు బయలు దేరి ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రాజ్య సభలో కర్ణాటకకు అనుకూలంగా కేంద్ర సహాయమంత్రి వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లినట్లయ్యింది. కావేరీ నదిపై ఎలాంటి నిర్మాణం చేపట్టినా తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అనుమతి తీసుకోవాలని సుప్రీంకోర్టు 2026 ఫిబ్రవరి 16నాటి తీర్పులో ఎక్కడా పేర్కొనలేదని మంత్రి వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారి తీసింది. ఈవ్యవహారంపై సర్వత్రా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

పెద్ద కుట్ర..

పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి స్పందిస్తూ..... 1892, 1924 నాటి ఒప్పందాల ప్రకారం దిగువన ఉన్న తమిళనాడు అనుమతి లేకుండా కర్ణాటక ఎలాంటి కొత్త డ్యామ్‌లు కట్టకూడదని స్పష్టంగా పేర్కొన్నటుల్‌ తెలిపారు. జూలై 16 వరకు తమిళనాడుకు 25.31 టీఎంసీల నీరు ఇవ్వాల్సి ఉండగా, కర్ణాటక కేవలం 3.37 టీఎంసీలు మాత్రమే విడుదల చేసిందన్నారు. తాజాగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండూ కలిసి తమిళనాడు ప్రయోజనాలకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు.

తాకట్టు పెట్టేశారు

ప్రధాన ప్రతి పక్ష నేత ఉదయ నిధి స్పందిస్తూ.... అధికారాన్ని కాపాడుకునేందుకు సీఎం విజయ్‌ తమిళనాడు హక్కులను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఢిల్లీ యజమానులను ఎదిరించలేక, తన అధికార పీఠాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మాట్లాడ లేని పరిస్థితులలో ఉన్నారని మండి పడ్డారు. మేఘదాతు వద్ద ఆనకట్ట కట్టడానికి కర్ణాటకకు తమిళనాడు అనుమతి అవసరం లేదంటూ కేంద్ర సహాయ మంత్రి ఇచ్చిన సమాధానం కావేరీ వ్యవహారంలో తమిళనాడు హక్కులను ప్రశ్నార్థకంగా మార్చిందని ఆందోళన వ్యక్తం చేశారు.

కావేరి నది

ఎందుకు వెనక్కి తగ్గినట్టో..!

వీది పీపుల్స్‌ నేత అన్నామలై సపదిస్తూ, తమిళనాడు రైతుల హక్కులను, ప్రయోజనాలను పక్కనపెట్టి, కేంద్ర ప్రభుత్వం తన మునుపటి స్పష్టమైన వైఖరి నుంచి ఉన్నపళంగా వెనక్కి తగ్గడం కర్ణాటక ఎన్నికల రాజకీయం కోసమేనా ..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఈవ్యవహారంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ పార్లమెంట్‌లోనే మాట్లాడుతూ... ఈ డ్యామ్‌ నిర్మాణం కోసం డీపీఆర్‌ తయారు చేసేందుకు కర్ణాటకకు ఇచ్చిన అనుమతి కొన్ని నిబంధనలకు లోబడి ఉందని, అంతరాష్ట్ర నదీ జలాల చట్టం ప్రకారం దిగువన ఉన్న రాష్ట్రాల అనుమతి లేకుండా ఎలాంటి ఆనకట్టలను నిర్మించలేరని స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రైతుల జీవనోపాధితో ముడిపడి ఉన్న ఇలాంటి సున్నితమైన విషయంలో కేంద్ర ప్రభుత్వం నిజాయితీగా, పారదర్శకంగా, ఒకే నిలకడైన వైఖరితో వ్యవహరించాలని కోరుకోవడం తప్పా? అని ప్రశ్నించారు.

తిప్పి కొడుదాం..

ఎండీఎంకే నేత వైగో స్పందిస్తూ అంతర్జాతీయ నీటి పంపిణీ చట్టాలు , సహజ న్యాయసూత్రాల ప్రకారం దిగువ ప్రాంత రాష్ట్రమైన తమిళనాడుకు ఉన్న కావేరీ నీటి హక్కులను కేంద్ర ప్రభుత్వ అండదండలతో లాక్కోవడానికి కర్ణాటక ప్రయత్నిస్తున్నదని ధ్వజమెత్తారు. ఈ ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు. రైతు సంఘం నేత పీఆర్‌ పాండియన్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ....తమిళనాడును నాశనం చేసేందుకు కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు. ఇందులో కాంగ్రెస్‌, బీజేపీల ఉమ్మడి కుట్ర తాజాగా స్పష్టమైందన్నారు. కావేరీ నదిపై ట్రిబ్యునల్‌ ఇచ్చిన తుది తీర్పుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, ట్రిబ్యునల్‌ ఆదేశాల ప్రకారం ఏర్పాటై పనిచేస్తున్న కావేరీ యాజమాన్య అథారిటీని కాదని, కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ మేకేదాటులో అక్రమంగా డ్యామ్‌ నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారని మండి పడ్డారు. మరో రైతు మహోద్యమం తథ్యమని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement