ప్రభుత్వం నిర్ణయం
అహ్లూవాలియా నేతృత్వంలో
ఆరుగురితో బృందం
స్థానిక స్థితిగతులపై సమీక్షకు గడువు
సాక్షి, చైన్నె: రాష్ట్ర పన్ను, పన్నుయేతర ఆదాయాన్ని పెంచడానికి, రాబడి లీకేజీలను అరికట్టి ఆర్థిక వనరులను మెరుగుపరచడానికి మాంటెక్ సింగ్ అహ్లూవాలియా అధ్యక్షతన ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సభ్యులుగా ప్రొఫెసర్ కె.పి. కృష్ణన్, ట్యాక్స్ పరిశీలన నిపుణుడు అరవింద్ మోదీ, మాజీ ఐఆర్‌ఎస్ అధికారి నజీబ్ షా, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎం.ఎ. సిద్ధిక్, మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ స్టడీస్ డైరెక్టర్ ఎం. సురేష్ బాబు నియమితులయ్యారు. ఈ కమిటీ రాష్ట్ర ఆర్థిక స్వయం సంవృద్దిని బలోపేతం చేయడం, సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు కావలసిన ఆర్థిక వనరులను సృష్టించడం, పన్ను నిబంధనలను సక్రమంగా అమలు చేయడం, ఆదాయ లీకేజీలను అరికట్టడం, పన్ను రేట్లు, రుసుములు , మినహాయింపులను క్రమబద్ధీకరించడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నది. అలాగే అలాగే కొత్త , ఇప్పటివరకు ఉపయోగించని ఆదాయ వనరులను గుర్తించడం ద్వారా రాష్ట్ర పన్ను, పన్నుయేతర ఆదాయాన్ని స్థిరంగా పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై 3 నెలల్లో ప్రభుత్వానికి సిఫార్సులు సమర్పించనుంది.
కో– ఆర్డినేటర్‌గా రాజ గోపాల్
ఈ కమిటీ కో–ఆర్డినేటర్‌గా ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి రాజగోపాల్ సుంకర వ్యవహరిస్తారు. అవసరమైతే టాస్మాక్ , స్టాంపులు–రిజిస్ట్రేషన్లు, ఖనిజ వనరులు, వాణిజ్య పన్నులు , రవాణా వంటి శాఖల కోసం ప్రత్యేక ఉప–కమిటీలను ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పించారు. అలాగే, ఏ ప్రభుత్వ శాఖ లేదా అధికారుల నుండి అయినా నేరుగా పత్రాలు, డేటాను కోరే అధికారాన్ని కూడా ఈ కమిటీకి కల్పించారు.
‘ఆదాయం’ పెంపునకు కమిటీ
స్థానిక సంస్థల ఆర్థిక స్థితి సమీక్షా కమిషన్ గడువు పొడిగించేందుకు నిర్ణయించారు. 2025లో డీఎంకే ప్రభుత్వ హయంలో 7వ రాష్ట్ర ఆర్థిక కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌కు విశ్రాంత ఐఏఎస్ అధికారి అలావుద్దీన్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ కమిషన్ రాష్ట్రంలోని స్థానిక సంస్థల (పంచాయతీలు, పురపాలక సంఘాలు మొదలైనవి) ఆర్థిక పరిస్థితులను సమీక్షించి, సమగ్ర నివేదికను ఆగస్టు 31 నాటికి ప్రభుత్వానికి సమర్పించాలని మొదట గడువు నిర్ణయించారు. అయితే, ప్రస్తుతం ఈ నివేదిక సమర్పణ గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించారు. దీనికి సంబంధించిన అధికారిక గెజెట్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిర్ణయంతో స్థానిక సంస్థల స్థితిగతులను పరిశీలించి, సమగ్ర సిఫార్సులను ప్రభుత్వానికి అందించేందుకు ఆర్థిక కమిషన్‌కు మరో 4 నెలల అదనపు సమయం లభించింది.


