‘హెచ్‌–1బీ’ కష్టాలు | Bill for three-year pause on H-1B visas introduced in US Congress | Sakshi
Sakshi News home page

‘హెచ్‌–1బీ’ కష్టాలు

Apr 26 2026 4:24 AM | Updated on Apr 26 2026 11:27 AM

Bill for three-year pause on H-1B visas introduced in US Congress

మూడేళ్ల నిషేధం విధించాలంటూ అమెరికా కాంగ్రెస్‌లో బిల్లు  

సాక్షి, న్యూఢిల్లీ: అమెరికాలో స్థిరపడాలనే భారతీయ టెక్నాలజీ నిపుణుల ఆశలపై నీళ్లు చల్లేలా అగ్రరాజ్యం కీలక అడుగులు వేస్తోంది. వీసా వ్యవస్థ ప్రక్షాళన పేరుతో నూతన హెచ్‌–1బీ వీసాల జారీపై మూడేళ్ల పాటు నిషేధం విధించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అమెరికా చట్టసభలో ప్రవేశపెట్టిన ‘హెచ్‌1బీ అబ్యూజ్‌ యాక్ట్‌–2026’ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.  

ట్రంప్‌ పార్టీ సభ్యులే..  
అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్‌ పార్టీ సభ్యుడు ఎలీ క్రేన్‌ ‘హెచ్‌–1బీ వీసా అబ్యూజ్‌ యాక్ట్‌–2026’బిల్లును అమెరికా చట్టసభ(కాంగ్రెస్‌)లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు మరో ఏడుగురు రిపబ్లికన్‌ చట్టసభ సభ్యులు బ్రియన్‌ బాబిన్, బ్రాండన్‌ గిల్, వెస్లీ హంట్, కీత్‌ సెల్ఫ్, ఆండీ ఓగ్లెస్, పాల్‌ గోసర్, టామ్‌ మెక్‌క్లింటాక్‌ మద్దతుగా నిలిచారు. సహ ప్రాయోజకులుగా(కో–స్పాన్సర్లుగా) సంతకాలు చేశారు.  

అసలు ఉద్దేశం ఏమిటి? 
హెచ్‌–1బీ వీసా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి, స్థానిక అమెరికన్ల ఉద్యోగాలను పరిరక్షించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని ప్రతిపాదకులు చెబుతున్నారు. అమెరికన్ల స్థానంలో తక్కువ వేతనాలకు పని చేసే విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి కార్పొరేట్‌ సంస్థలు హెచ్‌–1బీ వీసా వ్యవస్థను దురి్వనియోగం చేస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ‘అమెరికన్లకు ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంటే, వారినే నియమించుకోవాలి’అని డిమాండ్‌ చేస్తున్నారు. విదేశీయులకు ఉద్యోగాలు ఇవ్వడాన్ని అరికట్టేందుకు మూడేళ్ల పాటు హెచ్‌–1బీ వీసాల జారీని పూర్తిగా నిలిపివేసి, ఆ తర్వాత కఠిన నిబంధనలు అమలు చేయాలని బిల్లులో ప్రతిపాదించారు. ఈ నిబంధనల ద్వారా అమెరికా పౌరులకు ఉద్యోగాల్లో మొదటి ప్రాధాన్యత దక్కేలా చేయడమే బిల్లు లక్ష్యమని చట్టసభ సభ్యుడు ఎలీ క్రేన్‌ స్పష్టం చేశారు.  

హెచ్‌–1బీకి కొత్త నిబంధనలు  
 ప్రతిఏటా జారీ చేసే 65,000 హెచ్‌–1బీ వీసాల పరిమితిని ఏకంగా 25 వేలకు తగ్గించడం.  
 వీసా దక్కించుకునే విదేశీ నిపుణుల కనీస వార్షిక వేతనం 2 లక్షల డాలర్లుగా ఉండాలి.  
 ప్రస్తుతం అమల్లో ఉన్న లాటరీ విధానాన్ని రద్దు చేసి, ఎక్కువ వేతనం ఇచ్చే ఉద్యోగాల ఆధారంగా(వేజ్‌–బేస్డ్‌) ఎంపిక ప్రక్రియ చేపట్టాలి.  
హెచ్‌–1బీ వీసాదారులు తమ కుటుంబ సభ్యులను (డిపెండెంట్లు) అమెరికాకు తీసుకురావడాన్ని నిషేధించాలి.  

విదేశీ విద్యార్థులు చదువు పూర్తయ్యాక అక్కడే ఉండి ఉద్యోగం వెతుక్కునేందుకు, పని చేసుకునేందుకు వెసులుబా టు కల్పించే ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(ఓపీటీ) విధానాన్ని రద్దు చేయాలి. 
హెచ్‌–1బీ వీసాపై వచి్చన వారిని గ్రీన్‌ కార్డు (శాశ్వత నివాసిత హోదా) పొందేందుకు అనర్హులుగా మార్చాలి. ఈ వీసాలను కేవలం తాత్కాలిక అవసరాల కోసమే పరిమితం చేయాలి.  

థర్డ్‌–పార్టీ స్టాంఫింగ్‌ ఏజెన్సీల ద్వారా ఉద్యోగులను తీసుకోవడాన్ని నిరోధించాలి.  

భారతీయులపైనే అధిక ప్రభావం
అమెరికా ప్రభుత్వం ఏటా జారీ చేసే హెచ్‌–1బీ వీసాల్లో సుమారు 70 శాతానికి పైగా భారతీయులకే దక్కుతున్నాయి. తాజా బిల్లు ఆమోదం పొందితే, ప్రధానంగా భారతీయ టెక్నాలజీ నిపుణులపై తీవ్ర ప్రభావం పడుతుంది. కొత్తగా అమెరికాలోని ఐటీ కంపెనీల్లో చేరాలనుకునే నిపుణులకు కొన్నేళ్ల పాటు అవకాశాలు ఉండవు. అక్కడే ఉన్నత విద్య అభ్యసించి ఉద్యోగాలు సాధించాలన్న లక్ష్యంతో ఉన్న వేలాది మంది భారతీయ విద్యార్థుల కలలకు ఆటంకం ఏర్పడుతుంది.

కంపెనీల నిర్వహణ వ్యయం పెరుగుదల
హెచ్‌–1బీ వీసాల జారీ నిలిచిపోతే అమెరికాలోని టెక్‌ కంపెనీలు సైతం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగుల కొరత ఏర్పడుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో స్థానికులనే అధిక వేతనాలకు నియమించుకోవాల్సి వస్తుంది. దీనివల్ల ప్రాజెక్టుల నిర్వహణ వ్యయం పెరిగి సంస్థలపై ఆర్థిక భారం పడుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికన్‌ కంపెనీలు తమ కార్యకలాపాలను భారత్‌ లాంటి దేశాల్లో మరింతగా విస్తరించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement