
సాక్షి, న్యూఢిల్లీ: బీహార్ ఓటరు జాబితా వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ను వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీలు పిటిషన్లు దాఖలు చేశాయి.
సోమవారం వీటిని పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం ఈనెల 10న విచారణ చేపడతామని తెలిపింది. ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో.. ఆధార్, ఓటర్ గుర్తింపు కార్డును పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. జులై 25 కల్లా అధీకృత డాక్యుమెంట్లు చూపించకుంటే... ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని పిటిషన్‌లో ప్రతిపక్షాలు పేర్కొన్నాయి.
అయితే ఈ రివిజన్ కేవలం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకేనని, బీజేపీని వ్యతిరేకిస్తున్న వర్గాల ఓటర్ల జాబితా నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టారని ఆరోపిస్తూ.. ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో స్పెషల్ రివిజన్ ఆపివేయాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.