
న్యూడిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల కమిషన్(ఈసీ) అన్ని రాజకీయ పార్టీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత 48 గంటల వరకు(సైలెన్స్ పీరియడ్) ఎలాంటి బల్స్ ఎస్‌ఎంఎస్‌లు, ఆడియో మెసేజ్‌లు పంపరాదని ఈసీ హెచ్చరించింది. అలాగే టీవీ, కేబుల్ నెట్‌వర్క్‌లు, రేడియోల్లో, సినిమా హాల్లో ఎన్నికలకు సంబంధించి రాజకీయ ప్రకటనలు చేయరాదని ఆదేశాలు జారీ చేసింది.
అలాగే.. పోలింగ్‌నాడు ఆయా ప్రాంతంలో ఆడియో, విజువల్‌డిస్‌ప్లేలు నిషేధించినట్లు పేర్కొంది. సోషల్‌మీడియా ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో, అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేటప్పుడు వారి అధికారిక సోషల్ మీడియా ఖాతాల వివరాలను పొందుబరచాలని ఆదేశించింది.
ముందస్తు అనుమతులు తప్పనిసరి: రాజకీయ ప్రచార ప్రకటనలకు పార్టీలు తప్పనిసరిగా ముందుస్తు అనుమతులు తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాజకీయ పార్టీలకు, పోటీ చేసే అభ్యర్థులకు ఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది. అభ్యర్థులు సోషల్ మీడియాతో సహా ఎల్రక్టానిక్ లేదా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఏదైనా రాజకీయ ప్రకటనలు ప్రచురించడానికి లేదా ప్రసారం చేయడానికి ముందు మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ(ఎంసీఎంసీ) నుంచి ముందస్తు ధృవీకరణ పొందడం తప్పనిసరి అని తెలిపింది. ధృవీకరణ ప్రక్రియను పర్యవేక్షించడానికి జిల్లా, రాష్ట్రస్థాయిలో పలుమీడియా సర్టిఫికేషన్, ఎంసీఎంసీలను ఏర్పాటు చేసినట్లు ఈసీ పేర్కొంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు ఇప్పటికే నామినేషన్లు స్వీకరిస్తున్నారు(అక్టోబర్ 10వ తేదీన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది). అక్టోబర్ 17వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ. నవంబర్ 6వ తేదీన ఫస్ట్ ఫేజ్‌లో భాగంగా 121 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అంత కంటే 48 గంటల ముందు ప్రచారం ముగుస్తుంది. ఇందులో పాట్నా, ముజఫర్‌పూర్, గోపాల్‌గంజ్, దర్భంగా, బక్సర్, బీహార్ షరీఫ్ లాంటి కీలక నియోజకవర్గాలు ఉన్నాయి. మిగిలిన 123 స్థానాల రెండో ఫేజ్ పోలింగ్‌కు అక్టోబర్ 16న నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. అక్టోబర్ 23 దాకా నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 9వ తేదీన ప్రచారానికి చివరి తేదీ. నవంబర్ 11వ తేదీన పోలింగ్ ఉంటుంది. నవంబర్ 14వ తేదీన.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్, ఫలితాల వెల్లడి ఉంటుంది.