
ఈ నెలలో భారీ కుండపోత వానలు
ఏటా బెంగళూరు అతలాకుతలం
ఈ నెల కూడా పునరావృతం
బనశంకరి: మే నెల వర్షాలంటే బెంగళూరువాసులు వణికిపోవాల్సి వస్తోంది. అంత ఉధృతంగా వానలు పడి ముంపును కలిగిస్తున్నాయి. ఈ కష్టాలు పడలేక జనం మే వస్తోంటే గుబులు పడుతున్నారు.
అతి పెద్ద వానలకు రికార్డు
బెంగళూరులో మే నెలలో ఇప్పటివరకు 276 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇది సాధారణం కంటే చాలా ఎక్కువ అని వాతావరణశాఖ తెలిపింది.సిటీలో సాధారణంగా వేసవి కాలమైన మే నెలలో సరాసరి 128 మిల్లీమీటర్ల వర్షం కురుస్తుందని అంచనా.
కానీ ఈసారి మే పూర్తికావడానికి 10 రోజులు ఉండగానే 276.5 మిల్లీమీటర్ల వర్షం దంచేసింది. గత ఆదివారం ఒకేరోజు 132 మిల్లీమీటర్లు వర్షం పడి, ఒక నెలలో పడే వర్షం ఒకేరోజున కురిసింది.
2023 మే నెలలో నగరంలో 305 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఇప్పటివరకు మే లో కురిసిన అత్యధిక వర్షంగా రికార్డయింది. కొత్త రికార్డు సృష్టించడానికి 28.9 మిల్లీమీటర్లు వర్షం అవసరం.
నైరుతి రుతుపవనాలు ముందే రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం వల్ల ఈ మేలో భారీ వర్షాలు పడ్డాయి. గత పదేళ్లలో కురిసిన రెండో అతిపెద్ద వర్షం ఈ మేలోనే నమోదైంది. 2022లో 270.2 మిల్లీమీటర్ల కుండపోత కురిస్తే, ఈ రికార్డును గత ఆదివారం వర్షం బద్ధలు కొట్టింది. ఎండలు, రుతుపవనాలు కలిసి ఎక్కువ వర్షాలు వస్తాయని అంచనా.