
అన్న కొడుకులపై పాశవిక దాడి
ఇద్దరు పిల్లలు మృతి, మరొకరికి తీవ్రగాయాలు
బెంగళూరులో కిరాతకం
కర్ణాటక: ఓ మానసిక ఉన్మాది రక్తపాతాన్ని సృష్టించాడు. సొంత అన్న పిల్లలను తమ్ముడు క్రూరంగా హత్యచేసిన ఘటన బెంగళూరు హెబ్బగోడి పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. ఖాసీం (35) అనే సైకో దాడిలో మహమ్మద్ ఇషాక్ (9), మహ్మద్ జునైద్ (7), మృత్యువాత పడ్డారు. ఐదేళ్ల మహమ్మద్ రోహన్ ఆసుపత్రిలో చావుబతుకుల్లో ఉన్నాడు.
చిన్నారులపై ఉగ్రరూపం
నగర జాయింట్ పోలీస్ కమిషనర్ రమేశ్ బానోత్ వివరాలను వెల్లడించారు. పిల్లల తండ్రి చాంద్ బాషా ఐదేళ్ల కింద యాదగిరి నుంచి బెంగళూరులోని హెబ్బగోడికి వచ్చి భార్య, ముగ్గురు పిల్లలు, తల్లి, తమ్ముడు ఖాసీంతో జీవిస్తున్నాడు. చాంద్ బాషా గార పనిచేస్తుండగా భార్య గార్మెంట్స్‌కు వెళ్తోంది. ఖాసీం ఇంట్లోనే ఉండేవాడు, అతడు మానసిక అస్వస్థుడు కాగా, నెలరోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. గాలించి ఇంటికి తీసుకువచ్చారు.
మధ్యాహ్నం 1 గంట సమయంలో ఆవేశంతో వింతగా ప్రవర్తించసాగాడు. ముగ్గురు పిల్లల మర్మాంగం పై ఇనుప రాడ్, రాయితో దాడికి పాల్పడ్డాడు. పిల్లలు రక్తపుమడుగులో పడిపోయారు. ఆ సమయంలో అవ్వ కూరగాయలు తేవడానికి బయటకు వెళ్లింది. సమాచారం తెలిసి హెబ్బగోడి పోలీసులు చేరుకుని చూడగా ఇద్దరు చనిపోయి, ఒకరు తీవ్రగాయాలతో ఉన్నారు. ఆస్పత్రికి తరలించి హంతకున్ని అరెస్టు చేశారు.