సాక్షి,న్యూఢిల్లీ: ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు ఏడాదికి పెయిడ్ లీవ్స్ పొందేందుకు ఉద్యోగి కనీసం 240 పనిదినాలు పూర్తి చేయాలి. కొత్త కార్మిక చట్టాల ప్రకారం.. ఈ అర్హతకు కావాల్సిన పనిదినాల సంఖ్యను 180 రోజులకు తగ్గించింది. దీంతో ఉద్యోగులు అత్యవసర పరిస్థితుల్లో సెలవులు తీసుకున్నా వాటికి జీతం పొందే అవకాశం మరింత సులభతరమైంది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని ఇప్పటివరకు అమల్లో ఉన్న 29 కార్మిక చట్టాలను హేతుబద్ధం చేసింది. బదులుగా ఉద్యోగుల శ్రేయస్సే లక్ష్యంగా వాటి స్థానంలో కొత్తగా నాలుగు కార్మిక చట్టాలను అందుబాటులోకి తెచ్చింది. తద్వారా ఉద్యోగి రోజు వారీ పని గంటలు, పొందే వేతనంతో పాటు హెల్త్ బెన్ఫిట్స్‌లలో మార్పులు చోటు చేసుకున్నాయి.
పని గంటలు
ప్రతి సంస్థలో సాధారణంగా రోజుకు ఎనిమిది గంటలు వారానికి 48గంటలు పనిచేసే నిబంధన అలాగే కొనసాగుతోంది. కొత్తగా అమల్లోకి వచ్చిన కార్మిక చట్టాలతో వారంలో పనిచేసే పనిదినాల సంఖ్యను తగ్గించి పని గంటల్ని పెంచింది. అలా
వారంలో నాలుగు రోజుల వర్కింగ్ డే కోసం - రోజుకు 12 గంటలు
వారంలో ఐదు రోజుల వర్కింగ్ డే కోసం- రోజుకు 9.5 గంటలు
వారంలో ఆరు రోజుల వర్కింగ్ డే కోసం - రోజుకు 8 గంటలు
ఓవర్‌టైమ్: ఉద్యోగి ఒప్పుకుంటే అదనపు గంటలు పనిచేయించుకోవచ్చు. అందుకు పని చేసిన గంటలకు రెండు రెట్లు చెల్లించాలి. ముందున్న 75 గంటల ఓవర్‌టైమ్ పరిమితి తొలగించింది. రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక అవసరాల ప్రకారం కొత్త కార్మిక చట్టాల ప్రకారం అదనపు గంటలకు వేతనం చెల్లించాల్సి ఉంటుంది.
ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్షలు
40 ఏళ్ల పైబడిన ప్రతి ఉద్యోగికి ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్ష తప్పనిసరి. దీని ద్వారా అనారోగ్యాన్ని ముందుగానే గుర్తించడం, వైద్య ఖర్చులను తగ్గించడం హాజరు లోపాలను తగ్గించడం లక్ష్యం. ప్లాంటేషన్ విభాగంలో పనిచేసే కార్మికులకు ఈఎస్‌ఐసీ వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి.
ఆ రంగాల్లోని ఉద్యోగుల కోసం
తయారీ, టెక్ట్స్‌టైల్స్, రిటైల్, నిర్మాణ రంగాల్లో పనిచేసే కార్మికుల కోసం పెయిడ్ లీవ్స్‌లో మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఉద్యోగులు ఏడాది కాలంలో పెయిడ్ లీవ్స్ పొందేందుకు 240 పని దినాలు పూర్తి చేయాలి. ఆమొత్తం సంఖ్యను 180కి కుదించింది.


