భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం.. బ్లాస్టింగ్‌కు ప్లాన్‌? | Over 160 gelatin sticks found Uttarakhand Almora | Sakshi
Sakshi News home page

భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం.. బ్లాస్టింగ్‌కు ప్లాన్‌?

Nov 23 2025 9:21 AM | Updated on Nov 23 2025 9:30 AM

Over 160 gelatin sticks found Uttarakhand Almora

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు లభ్యం కావడం తీవ్ర కలకలం సృష్టించింది. 20 కిలోలకు పైగా బరువున్న జిలెటిన్ స్టిక్స్ ప్యాకెట్లు బయటపడటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎర్రకోట పేలుడు, ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయం సమీపంలో 2,900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న తర్వాత తాజాగా ఇలా పేలుడు పదార్ధాలు లభ్యంచడంతో దేశవ్యాప్తంగా భద్రతా సంస్థలు అలర్ట్‌ అయ్యాయి. దీనిపై దర్యాప్తు చేపట్టినట్టు అధికారులు చెబుతున్నారు.

వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లా సుల్త్ ప్రాంతంలోని దబారా గ్రామంలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాల సమీపంలో 161 శక్తివంతమైన పేలుడు పదార్థమైన జిలెటిన్ స్టిక్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాఠశాల సమీపంలో పిల్లలు ఆడుకుంటుండగా సమీపంలోని పొదల్లో అనుమానాస్పద వస్తువును గుర్తించారు. దీంతో, స్కూల్‌ ప్రిన్సిపాల్‌.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుని అక్కడి వారిని అలర్ట్‌ చేసింది. బాంబు నిర్వీర్య బృందం, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. పరిసర ప్రాంతాల్లో గాలించాయి. పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుని.. నమూనాలను సేకరించాయి. అనంతరం, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

ఈ సందర్బంగా అల్మోరా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) దేవేంద్ర పించా మీడియాతో మాట్లాడుతూ.. పేలుడు పదార్థాల స్వాధీనంపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. పుకార్లను నమ్మవద్దని ఆయన ప్రజలను కోరారు. దర్యాప్తు కొనసాగుతున్నప్పుడు ధృవీకరించబడిన సమాచారాన్ని వివరిస్తామని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా.. జిలెటిన్ స్టిక్స్‌ను సాధారణంగా నిర్మాణాలు, మైనింగ్ పనుల్లో రాళ్లను పేల్చేందుకు జిలెటిన్ స్టిక్స్‌ను ఉపయోగిస్తారు. అయితే, ఇంత భారీ మొత్తంలో వీటిని గ్రామానికి ఎందుకు తీసుకొచ్చారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారి వివరించారు. ఈ ఘటనపై పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులపై ఎక్స్‌ప్లోజివ్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ 1908, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) కింద కేసు నమోదు చేశారు. లోతైన విచారణ కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్ఎస్‌పి వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement