
బస్తర్: ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మరోసారి అలజడి రేగింది. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతాన్ని భద్రతా బలగాలు భారీ సంఖ్యలో చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. మావోయిస్టు కీలక నేతలే లక్ష్యంగా ఈ భారీ ఆపరేషన్ చేపట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో మావోయిస్టు అగ్రనేతలకు మరోసారి తీవ్ర హెచ్చరికలు వెళ్లాయి.
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులపై భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ల నేపథ్యంలో.. బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందర్ రాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. లొంగి పోతారా? లేదంటే ఎన్‌కౌంటరై పోతారా? అంటూ హెచ్చరికలు జారీ చేశారాయన. గణపతి, హిడ్మా టార్గెట్‌గా.. సుమారు 25 వేల మందితో ఈ భారీ కూంబింగ్ ఆపరేషన్ జరుపుతున్నట్లు సమాచారం.
తాజాగా.. కొండగావ్-నారాయణ్‌పూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు కీలక మావోయిస్టు నేతలు హతమయ్యారు. వారిపై కలిపి రూ.13 లక్షల రివార్డులు ఉన్నాయి. భద్రతా బలగాలు ఏకే-47 తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌పై స్పందించిన తరుణంలోనే బస్తర్ ఐజీ పై వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్‌లో 140 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. వీరిలో 123 మంది బస్తర్ డివిజన్‌లోనే ఉండడం గమనార్హం.

ఇదిలా ఉంటే.. ఛత్తీస్‌గఢ్ బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందర్ రాజ్ మావోయిస్టులకు గట్టి హెచ్చరిక జారీ చేయడం ఇదే తొలిసారేం కాదు. నంబాల ఎన్‌కౌంటర్ తర్వాత.. ఆయనలాగే ఎన్‌కౌంటర్‌లో చనిపోవాలా? లేక లొంగిపోవాలా? అనేది మావోయిస్టు టాప్ లీడర్లే నిర్ణయించుకోవాలంటూ వ్యాఖ్యలు చేశారాయన. ‘‘ఈ సంఘటన తర్వాత, మిగిలిన మావోయిస్టు నేతలకు ఇక బస్తర్‌లో తలదాచుకోవడానికి స్థలం లేకుండా పోయింది. గణపతి, దేవ్జీ, సోను, హిడ్మా, సుజాత, రామ్ చంద్ర రెడ్డి, బర్సే దేవా.. వీళ్లందరినీ కూడా ఇదే తరహాలో ఎదుర్కొంటాం. మావోయిస్టు గ్రూపుల్లో ప్రస్తుతం నాయకత్వ సంక్షోభం ఉంది. బసవరాజు మరణం మానసికంగా కూడా వారిని కుంగదీసింది అని ఐజీ సుందర్ ఆ టైంలో వ్యాఖ్యానించారు.