breaking news
inspector general
-
‘తప్పు చేశావ్ నాన్న’ .. తండ్రి తప్పు చేస్తే కూతురు సరిదిద్దింది
లక్నో: ఓ పోలీసు ఉన్నతాధికారి (ఐజీ) తన కింద స్థాయి మహిళా ఉద్యోగిని వేధించాడన్న ఆరోపణల నేపథ్యంలో అతడిని విధుల నుంచి తొలగించారు. ఈ కేసులో సదరు పోలీసు అధికారి కుమార్తె బాధితుడి తరఫున కోర్టులో తన వాదనలు వినిపించారు. ఆమె తన తండ్రి తీసుకున్న నిర్ణయం తప్పని, న్యాయపరంగా అన్యాయమని న్యాయస్థానంలో తన వాదనలు వినిపించారు. చివరికి, ఆమె వాదనలు.. తన తండ్రి తీసుకున్న నిర్ణయం తప్పని నిరూపించాయి. ఇంతకీ ఎవరా కుమార్తె? ఆమె కథేంటీ?అది జనవరి 13,2023. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ రైల్వేస్టేషన్. ఫిలిబిట్కు చెందిన ఓ బాలిక బరేలీ రైల్వే స్టేషన్‌కు రావాల్సిన సమయం కంటే ఒకరోజే ముందే వచ్చింది. అయితే, ఆ బాలికను పోలీసు కానిస్టేబుల్ తౌఫిక్ అహ్మద్ వేధించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో పోలీసు శాఖ అతడిపై చర్యలకు ఉపక్రమించింది. విచారణ చేపట్టి బరేలీ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ రాకేష్ సింగ్ కానిస్టేబుల్ తౌఫిక్‌ను విధుల నుంచి తొలగించారు.బాధితురాలు మైనర్ కావడంతో రైల్వే పోలీసులు తౌఫిక్‌పై పోక్స్ యాక్ట్కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. లోయర్ కోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించినప్పటికీ, బరేలీ ఐజీ రాకేష్ సింగ్ అతనిపై శాఖా విచారణ జరిపి ఉద్యోగం నుండి తొలగించారు. ఇదే అంశాన్ని సవాలు చేస్తూ తౌఫిక్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన తరుఫున వాదించమని ఇన్స్పెక్టర్ జనరల్ రాకేష్ సింగ్ కుమార్తె అనురా సింగ్‌ను ఆశ్రయించారు. వాస్తవానికి తౌఫిక్‌కు అనూరా సింగ్ ఐజీ రాకేష్ సింగ్ కుమార్తె అని తెలియదు.తౌఫిక్ కేసు కోర్టులో వాదనలు మొదలయ్యాయి. కానిస్టేబుల్ తరఫున అనురా సింగ్ తన వాదనలు వినిపించారు. విచారణలో పోలీసు శాఖ పద్ధతులు పాటించలేదని, ఉద్యోగం తొలగింపు చట్టబద్ధంగా లేదని హైకోర్టు ముందు పలు ఆధారాలు ముందుంచారు. ఇరు పక్షాల వాదనలు విన్న అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. తౌఫిక్ అహ్మద్‌పై పోలీసు శాఖ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసింది. తౌఫిక్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది.ఇటీవల అలహాదాబాద్ హైకోర్టులో చర్చాంశనీయంగా మారిన ఈ కేసుపై అనూరా సింగ్ తండ్రి మాజీ ఐజీ రాకేష్ సింగ్ స్పందించారు. న్యాయవాదిగా అనూరా తన బాధ్యతను నిబద్ధతతో నిర్వహించిందని, తన కుమార్తెను చూస్తే తనకు గర్వంగా ఉందని అన్నారు. ఆమె తన పని చేసింది, నేను నా పని చేశాను. ఇది ఒక తండ్రిగా గర్వించదగిన విషయం అంటూ కుమార్తెపై ప్రశంసల వర్షం కురిపించారు. మరోవైపు, తౌఫిక్ అహ్మద్ సైతం లాయర్ అనూరాపై ప్రశంసలు కురిపించారు. ఆమె నాకు ఉద్యోగం మాత్రమే కాదు..గౌరవాన్ని కూడా తిరిగి ఇచ్చింది’అని సంతోషం వ్యక్తం చేశారు. -
లొంగిపోతారా?.. ఎన్‌కౌంటరై పోతారా?
బస్తర్: ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మరోసారి అలజడి రేగింది. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతాన్ని భద్రతా బలగాలు భారీ సంఖ్యలో చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. మావోయిస్టు కీలక నేతలే లక్ష్యంగా ఈ భారీ ఆపరేషన్ చేపట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో మావోయిస్టు అగ్రనేతలకు మరోసారి తీవ్ర హెచ్చరికలు వెళ్లాయి. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులపై భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ల నేపథ్యంలో.. బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందర్ రాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. లొంగి పోతారా? లేదంటే ఎన్‌కౌంటరై పోతారా? అంటూ హెచ్చరికలు జారీ చేశారాయన. గణపతి, హిడ్మా టార్గెట్‌గా.. సుమారు 25 వేల మందితో ఈ భారీ కూంబింగ్ ఆపరేషన్ జరుపుతున్నట్లు సమాచారం. తాజాగా.. కొండగావ్-నారాయణ్‌పూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు కీలక మావోయిస్టు నేతలు హతమయ్యారు. వారిపై కలిపి రూ.13 లక్షల రివార్డులు ఉన్నాయి. భద్రతా బలగాలు ఏకే-47 తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌పై స్పందించిన తరుణంలోనే బస్తర్ ఐజీ పై వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్‌లో 140 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో మరణించారు. వీరిలో 123 మంది బస్తర్ డివిజన్‌లోనే ఉండడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఛత్తీస్‌గఢ్ బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందర్ రాజ్ మావోయిస్టులకు గట్టి హెచ్చరిక జారీ చేయడం ఇదే తొలిసారేం కాదు. నంబాల ఎన్కౌంటర్ తర్వాత.. ఆయనలాగే ఎన్కౌంటర్లో చనిపోవాలా? లేక లొంగిపోవాలా? అనేది మావోయిస్టు టాప్ లీడర్లే నిర్ణయించుకోవాలంటూ వ్యాఖ్యలు చేశారాయన. ‘‘ఈ సంఘటన తర్వాత, మిగిలిన మావోయిస్టు నేతలకు ఇక బస్తర్‌లో తలదాచుకోవడానికి స్థలం లేకుండా పోయింది. గణపతి, దేవ్‌జీ, సోను, హిడ్మా, సుజాత, రామ్ చంద్ర రెడ్డి, బర్సే దేవా.. వీళ్లందరినీ కూడా ఇదే తరహాలో ఎదుర్కొంటాం. మావోయిస్టు గ్రూపుల్లో ప్రస్తుతం నాయకత్వ సంక్షోభం ఉంది. బసవరాజు మరణం మానసికంగా కూడా వారిని కుంగదీసింది అని ఐజీ సుందర్ ఆ టైంలో వ్యాఖ్యానించారు. -
పాస్టర్ ప్రవీణ్‌ది సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్: ఏలూరు డీఐజీ
ఏలూరు, సాక్షి: పాస్టర్ ప్రవీణ్ పగడాల(Pastor Praveen Pagadala) మృతి కేసుపై నెలకొన్న అనుమానాలకు పోలీసులు పుల్‌స్టాప్ పెట్టారు. మద్యం మత్తులో బైక్ నడిపి కింద పడిపోవడం వల్లే ప్రవీణ్ ప్రాణాలు పొగొట్టుకున్నారని ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్(Ashok Kumar) వెల్లడించారు. ఈ మేరకు ఈ కేసుకు సంబంధించిన వివరాలను శనివారం రాజమండ్రిలో ఆయన మీడియాకు వివరించారు.హైదరాబాద్ నుంచి పాస్టర్ బైక్ మీద బయల్దేరారు. ఆయన ప్రయాణించిన మార్గంలో సీసీ టీవీ ఫుటేజీ వివరాలు అన్నీ సేకరించాం. ఒక్క రామవరప్పాడు జంక్షన్ వద్ద సీసీటీవీ ఫుటేజీ లభించలేదు. పాస్టర్ ఆరోజు ఎవరెవరితో మాట్లాడారో గుర్తించాం. పాస్టర్ ప్రవీణ్ కుటుంబ సభ్యులను కూడా విచారించాం. ఆయన్ని హత్య చేశారని, అనుమానాస్పద మృతి అని రకరకాల ప్రచారాలు చేశారు. సోషల్ మీడియాలో అలా దుష్ర్పచారం చేసినవారికి నోటీసులు ఇచ్చి విచారిస్తున్నాం.అరోజు ప్రవీణ్ కుమార్ వస్తున్నారని కుటుంబ సభ్యులకు తప్ప ఎవరికీ తెలియదు. మార్గమధ్యలో ఆరుగురితో పాస్టర్ ప్రవీణ్ మాట్లాడారు. మూడు చోట్ల లిక్కర్ కొనుగోలు చేశారు. మద్యం, పెట్రోల్ బంకులలో యూపీఐ పేమెంట్స్ జరిపినట్లు ఆధారాలున్నాయి. మార్గం మధ్యలో ఓ పోలీస్ అధికారి ప్రవీణ్‌తో మాట్లాడారు. మద్యం సేవించడంతో డ్రైవ్ చేయొద్దని వారించారు. అయినా కూడా ఆయన వినకుండా ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో మూడు చోట్ల ఆయనకు యాక్సిడెంట్లు అయ్యాయి. ప్రమాదంలో హెడ్ లైట్ డ్యామేజ్ అయ్యిది. హెడ్ లైట్ పగిలిపోవడంతో రైట్ ఇండికేటర్ వేసుకుని పాస్టర్ ప్రయాణించారు.పోస్ట్ మార్టం రిపోర్టులో, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదికలో (ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్)లో ఆయన మద్యం సేవించినట్లు తేలింది. మరో వాహనంతో ప్రమాదం జరిగినట్లు ఆధారాలు లభించలేదు. ప్రమాద స్థలానికి చేరుకున్నపుడు పాస్టర్ ప్రవీణ్ 70 కి.మీ. వేగంతో ప్రయాణిస్తోంది. కంకర రోడ్డు కారణంగా బైక్ స్లిప్ అయి రోడ్డుపక్కన గుంతలో పడిపోయారు. గుంత అర్ధచంద్రాకారంలో ఉండడం వల్ల బైక్ ఎగిరి పాస్టర్‌పై పడింది. తలకు బలమైన గాయమై చనిపోయారని వైద్యులు తమ నివేదికలో తెలిపారు. పాస్టర్ ప్రవీణ్‌ది సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ అని ఏలూరు డీఐజీ అశోక్ కుమార్ ప్రకటించారు.పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణంపై సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో అన్ని విధాలుగా, క్షుణ్ణంగా పరిశోధించామని ఆయన తెలిపారు. కంకర వల్ల బైక్ స్లిప్ అయి పడిపోవడమే పాస్టర్ మరణానికి కారణమని, మరే వాహనం ఆయన బైక్ ను ఢీ కొట్టలేదని స్పష్టంగా తేలిందన్నారు. పాస్టర్ బయలుదేరిన సమయం నుంచి ప్రమాద స్థలం వరకు ఎప్పుడెప్పుడు ఏం జరిగిందనే వివరాలు పరిశోధించి తెలుసుకున్నామని ఆయన వివరించారు. -
రూ. 500 చెక్కు..ఆనందంలో ఐజీ!
లక్నో : ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు పొందినా లభించని సంతోషం కేవలం రూ. 500ల చెక్కులో దొరికిందని సతీశ్ గణేష్ అనే పోలీసు అధికారి హర్షం వ్యక్తం చేశారు. ఓ సాధారణ పౌరుడు రాసిన లేఖ చూసి ఇంతవరకు తాను అందుకున్న ప్రశంసల్లో ఇదే గొప్పదని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న సతీశ్‌కు విజయ్‌పాల్ సింగ్ అనే వ్యక్తి గురువారం లేఖ రాశాడు. ప్రశంసా ప్రమాణ పత్ర పేరిట రాసిన ఆ లేఖలో...‘ పేదవాళ్లను అవమానించడం, వారి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో అలసత్వం వహించే ఎంతో మంది పోలీసులను రోజూ చూస్తుంటాం. కానీ మీరు అలా కాదు. మీ పనితనం నాకెంతగానో నచ్చింది. అందుకే ఉత్తరంతో పాటు రూ. 500 చెక్కును జత చేస్తున్నాను’ అని ఇటాకు చెందిన విజయ్‌పాల్ పేర్కొన్నాడు. ఈ క్రమంలో సతీశ్ మాట్లాడుతూ..తన 23 ఏళ్ల కెరీర్లో అందుకున్న అత్యుత్తమ ప్రశంస ఇదేనని సంతోషం వ్యక్తం చేశారు. తాను ఎన్నెన్నో అవార్డులు, ప్రశంసా పత్రాలు పొందానని.. అయితే విజయ్‌పాల్ లేఖ తనకు బంగారు పతకంతో సమానం అన్నారు. ఎవరి రక్షణ కోసమైతే అహర్నిశలు శ్రమిస్తున్నామో.. అటువంటి ప్రజల నుంచి ఇలాంటి కితాబులు అందుకున్నప్పుడు అలసటను మర్చిపోతామని పేర్కొన్నారు. ఉన్నత అధికారులతో పాటు ప్రజల నుంచి కూడా ఇలాంటి ప్రోత్సాహం అందితే..ఏ అధికారికైనా మరింత అంకితభావంతో పనిచేయాలనే భావన కలుగుతుందన్నారు. యువ పోలీసులకు స్ఫూర్తి అందించే విజయ్‌పాల్ లేఖను, చెక్కును లామినేషన్ చేయించి తన కార్యాలయంలో భద్రపరుస్తానని వెల్లడించారు. -
విధులతో పాటు ఆరోగ్యమూ ముఖ్యం: ఐజీ శివధర్‌రెడ్డి
పంజగుట్ట: నిత్యం ఒత్తిడితో పనిచేసే పోలీసులు విధులతో పాటు వారి ఆరోగ్యం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ తెలంగాణ రాష్ట్ర ఐజీ శివధర్‌రెడ్డి అన్నారు. ఆహారం, నిద్ర విషయంలో వేళలు పాటించాలన్నారు. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. మంగళవారం ఖైరతాబాద్‌లోని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్‌డబ్ల్యు) కార్యాలయంలో సాగర్ ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్, ఐఎస్‌డబ్ల్యు సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. సుమారు 400 మంది వైద్యపరీక్షలు చేయించుకున్నారు. శివధర్‌రెడ్డి, ఐఎస్‌డబ్ల్యు ఐజీ మహేష్ భగవత్‌లు కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. నిమ్స్ వైద్యులు, సరోజినీదేవి కంటి ఆసుపత్రి వైద్యులు పర్యవేక్షించారు. నిమ్స్ కార్డియాలజీ విభాగ ప్రొఫెసర్ జ్యోత్స్న, డాక్టర్లు కాంచన, లక్ష్మి, సందీప్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.