
లక్నో: ఓ పోలీసు ఉన్నతాధికారి (ఐజీ) తన కింద స్థాయి మహిళా ఉద్యోగిని వేధించాడన్న ఆరోపణల నేపథ్యంలో అతడిని విధుల నుంచి తొలగించారు. ఈ కేసులో సదరు పోలీసు అధికారి కుమార్తె బాధితుడి తరఫున కోర్టులో తన వాదనలు వినిపించారు. ఆమె తన తండ్రి తీసుకున్న నిర్ణయం తప్పని, న్యాయపరంగా అన్యాయమని న్యాయస్థానంలో తన వాదనలు వినిపించారు. చివరికి, ఆమె వాదనలు.. తన తండ్రి తీసుకున్న నిర్ణయం తప్పని నిరూపించాయి. ఇంతకీ ఎవరా కుమార్తె? ఆమె కథేంటీ?
అది జనవరి 13,2023. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ రైల్వేస్టేషన్. ఫిలిబిట్‌కు చెందిన ఓ బాలిక బరేలీ రైల్వే స్టేషన్‌కు రావాల్సిన సమయం కంటే ఒకరోజే ముందే వచ్చింది. అయితే, ఆ బాలికను పోలీసు కానిస్టేబుల్ తౌఫిక్ అహ్మద్ వేధించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో పోలీసు శాఖ అతడిపై చర్యలకు ఉపక్రమించింది. విచారణ చేపట్టి బరేలీ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ రాకేష్ సింగ్ కానిస్టేబుల్ తౌఫిక్‌ను విధుల నుంచి తొలగించారు.
బాధితురాలు మైనర్ కావడంతో రైల్వే పోలీసులు తౌఫిక్‌పై పోక్స్ యాక్ట్‌కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. లోయర్ కోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించినప్పటికీ, బరేలీ ఐజీ రాకేష్ సింగ్ అతనిపై శాఖా విచారణ జరిపి ఉద్యోగం నుండి తొలగించారు. ఇదే అంశాన్ని సవాలు చేస్తూ తౌఫిక్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన తరుఫున వాదించమని ఇన్‌స్పెక్టర్ జనరల్ రాకేష్ సింగ్ కుమార్తె అనురా సింగ్‌ను ఆశ్రయించారు. వాస్తవానికి తౌఫిక్‌కు అనూరా సింగ్ ఐజీ రాకేష్ సింగ్ కుమార్తె అని తెలియదు.
తౌఫిక్ కేసు కోర్టులో వాదనలు మొదలయ్యాయి. కానిస్టేబుల్ తరఫున అనురా సింగ్ తన వాదనలు వినిపించారు. విచారణలో పోలీసు శాఖ పద్ధతులు పాటించలేదని, ఉద్యోగం తొలగింపు చట్టబద్ధంగా లేదని హైకోర్టు ముందు పలు ఆధారాలు ముందుంచారు. ఇరు పక్షాల వాదనలు విన్న అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. తౌఫిక్ అహ్మద్‌పై పోలీసు శాఖ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసింది. తౌఫిక్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది.
ఇటీవల అలహాదాబాద్ హైకోర్టులో చర్చాంశనీయంగా మారిన ఈ కేసుపై అనూరా సింగ్ తండ్రి మాజీ ఐజీ రాకేష్ సింగ్ స్పందించారు. న్యాయవాదిగా అనూరా తన బాధ్యతను నిబద్ధతతో నిర్వహించిందని, తన కుమార్తెను చూస్తే తనకు గర్వంగా ఉందని అన్నారు. ఆమె తన పని చేసింది, నేను నా పని చేశాను. ఇది ఒక తండ్రిగా గర్వించదగిన విషయం అంటూ కుమార్తెపై ప్రశంసల వర్షం కురిపించారు.
మరోవైపు, తౌఫిక్ అహ్మద్ సైతం లాయర్ అనూరాపై ప్రశంసలు కురిపించారు. ఆమె నాకు ఉద్యోగం మాత్రమే కాదు..గౌరవాన్ని కూడా తిరిగి ఇచ్చింది’అని సంతోషం వ్యక్తం చేశారు.