2025కి నేటి అర్ధరాత్రితో శుభం కార్డు పడినట్టే. ప్రపంచమంతా 2025కి బై బై చెప్పేసి.. 2026కి వెల్‌కమ్ చెప్పబోతోంది. చిత్ర పరిశ్రమ కూడా కోటి ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకబోతోంది. 2025లో పెద్ద, చిన్న సినిమాలు కలిపి తెలుగులో దాదాపు 250 విడుదలయ్యాయి. అయితే విజయాల శాతం తక్కువే. ఈ ఏడాదిలో రిలీజైన సినిమాలు, హిట్ అయినవి, ప్రేక్షకులను మెప్పించినవి, మెప్పించే ప్రయత్నం చేసిన చిత్రాల వివరాలేంటో ఓ లుక్కేద్దాం.
⇒ జనవరిలో టాలీవుడ్ అంటే సంక్రాంతి సినిమాలను గురించే ప్రధానంగా చర్చించుకుంటారు. 2025 సంక్రాంతికి రామ్‌చరణ్ ‘గేమ్ చేంజర్’, బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలు విడుదలయ్యాయి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రూ. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను సాధించి 2025 సంక్రాంతి బాక్సాఫీస్ విన్నర్‌గా నిలిచింది. ‘గాంధీ తాత చెట్టు’ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. దర్శక–నిర్మాత సుకుమార్ తనయ సుకృతి వేణి లీడ్ రోల్‌లో నటించిన సినిమా ఇది. ఈ మూవీతో సుకృతి ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డును అందుకున్నారు. అలాగే జనవరి 24నే విడుదలైన ‘హత్య’ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
⇒ ఫిబ్రవరి నెలలో దాదాపు పదిహేను సినిమాలు విడుదలయ్యాయి. నాగచైతన్య ‘తండేల్’ సినిమాతో థియేటర్స్‌లోకి వచ్చారు. ఈ చిత్రం రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను సాధించింది. బ్రహ్మానందం, రాజా గౌతమ్, వెన్నెల కిషోర్ లీడ్ రోల్స్‌లో నటించిన ‘బ్రహ్మా ఆనందం’ సినిమా ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసింది. సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘మజాకా’ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. విశ్వక్ సేన్ ‘లైలా’ చిత్రం ఆడియన్స్ ను నిరాశపరచగా, ‘బాపు’, ‘రామం రాఘవం’ చిత్రాలు ప్రేక్షకుల మెప్పు పొందే ప్రయత్నం చేశాయి.
⇒ మార్చిలో దాదాపు 20 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ‘కోర్ట్’ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అలాగే ‘మ్యాడ్ 2’ చిత్రం ఆడియన్స్ ను ఎంటర్‌టైన్ చేసింది. నితిన్ ‘రాబిన్ హుడ్’, కిరణ్ అబ్బవరం ‘దిల్ రూబా’ చిత్రాలు అంచనాలను అందుకోలేకపోయాయి.
⇒ ఏప్రిల్‌లో పదిహేడు సినిమాలు ప్రేక్షకులముందుకొచ్చాయి. సిద్ధు జొన్నలగడ్డ ‘జాక్’ ప్రేక్షకులను అలరించలేకపోయింది. తమన్నా ‘ఓదెల 2’, కల్యాణ్‌రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతీ’, ప్రియదర్శి ‘సారంగపాణి జాతకం’,
ఇంద్రరామ్ ‘చౌర్యపాఠం’, ప్రదీప్ మాచి రాజు ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ వంటి చిత్రాలు ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాయి.
⇒ మే నెల ఆరంభంలో నాని ‘హిట్: ది థర్డ్ కేస్’ రిలీజై యాక్షన్ ఆడియన్స్ ను అలరించింది. శ్రీవిష్ణు ‘సింగిల్’ సినిమా హిట్‌గా నిలిచింది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లీడ్ రోల్స్‌లో నటించిన ‘భైరవం’ ఆడియన్స్ ను అలరించే ప్రయత్నం చేసింది. సమంత నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’, రాజేంద్ర ప్రసాద్ ‘షష్ఠిపూర్తి’ వంటి చిత్రాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి.
⇒ జూన్ లో పదికంటే తక్కువ చిత్రాలే విడుదలయ్యాయి. నాగార్జున, ధనుష్‌ల ‘కుబేర’ హిట్‌గా నిలిచింది. అనంతిక సనీల్‌కుమార్ ‘8 వసంతాలు’ సినిమా ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది. మంచు విష్ణు ‘కన్నప్ప’ చిత్రం హిట్ ఫిల్మ్‌గా నిలిచింది.
⇒ జూలైలో 18 సినిమాలు ప్రేక్షకులముందుకొచ్చాయి. వాటిలో నితిన్ ‘తమ్ముడు’, పవన్ కల్యాణ్ ‘హరి హర వీరమల్లు’, విజయ్ దేవరకొండ ‘కింగ్ డమ్’ వంటి సినిమాలు భారీ అంచనాల నడుమ విడుదలయి, ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాయి. ‘మహావతార్ నరసింహ’ అనే యానిమేషన్ ఫిల్మ్ మాత్రం బ్లాక్‌బస్టర్ అయింది.
⇒ ఆగస్టు నెలలో దాదాపు 14 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ‘థ్యాంక్యూ డియర్, బకాసుర రెస్టారెంట్, పరదా, యూనివర్శిటీ, సుందరకాండ, త్రిబాణధారి బార్బరిక్’ వంటి సినిమాలు ప్రేక్షకులముందుకొచ్చాయి.
⇒ సెప్టెంబరులో కేవలం ఎనిమిది చిత్రాలు ఆడియన్స్ ముందుకొచ్చినప్పటికీ విజయాల శాతం ఎక్కువగా ఉంది. అనుష్క ‘ఘాటీ’, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ‘కిష్కింధపురి’, తేజా సజ్జా ‘మిరాయ్’, పవన్ కల్యాణ్ ‘ఓజీ’, ‘లిటిల్ హార్ట్స్’ సినిమాలు విజయం సొంతం చేసుకున్నాయి .
⇒ అక్టోబరులో దాదాపు డజను సినిమాలు వెండితెరపైకి వచ్చాయి. వీటిలో అనసూయ, సాయికుమార్ ‘అరి’, రక్షిత్ శెట్టి ‘శశివదనే’, సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసుకదా’, కిరణ్ అబ్బవరం ‘కె–ర్యాంప్’, రవితేజ ‘మాస్ జాతర’ సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో కిరణ్ అబ్బవరం ‘కె–ర్యాంప్’ మాత్రం హిట్‌గా నిలిచింది. ‘బాహుబలి: ది ఎపిక్’ మూవీ కూడా ఆడియన్స్‌ని అలరించింది.
⇒ నవంబరులో సుమారుపాతిక చిత్రాల ప్రేక్షకులముందుకొచ్చాయి. వాటిలో సుధీర్ బాబు ‘జటాధర’, రష్మికా మందన్నా ‘ది గర్ల్ ఫ్రెండ్’, తిరువీర్ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’, విక్రాంత్ రెడ్డి ‘సంతాన ప్రాప్తిరస్తు, ‘అల్లరి’ నరేశ్ ‘12 ఎ రైల్వే కాలనీ’, రాజ్ తరుణ్ పాంచ్ మినార్’, ప్రియదర్శి ‘ప్రేమంటే’, అఖిల్ రాజ్ ‘రాజు వెడ్స్ రాంబాయి’, రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ వంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది.
⇒ 2025లో ఆఖరి నెల అయిన డిసెంబరులో దాదాపు పదిహేను సినిమాలకుపైగా వెండితెరపైకి వచ్చాయి. వాటిలో బాలకృష్ణ ‘అఖండ 2:తాండవం’, రోషన్ కనకాల ‘మోగ్లీ’, నరేశ్ అగస్త్య ‘గుర్రంపాపిరెడ్డి’, హెబ్బా పటేల్ ‘మారియో’, నవదీప్ ‘దండోరా’, త్రిగుణ్, అఖిల్ రాజ్ ‘ఈషా’, ఆది సాయికుమార్ ‘శంబాల’, మోహన్‌లాల్ ‘వృషభ’ వంటి సినిమాలున్నాయి. వీటిలో ‘అఖండ 2: తాండవం’, ‘గుర్రంపాపిరెడ్డి’, ‘దండోరా’, ‘ఈషా’, ‘శంబాల’, ‘వృషభ’ వంటి చిత్రాలు ప్రేక్షకుల మెప్పు పొందాయి.


