నేతలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు
ఫ్యూచర్ సిటీలో నాలుగో కమిషనరేట్ ఆవిర్భావం
గ్రేటర్‌లో పోలీసు విభాగం పునర్ వ్యవస్థీకరణ
కొత్త జోన్లు, డివిజన్లు, ఠాణాల ఏర్పాటు తథ్యం
సాక్షి, హైదరాబాద్: ఫోకల్ పోస్టింగ్‌ల కోసం ఖాకీల పైరవీలు అప్పుడే మొదలయ్యాయి. రాజధానిలో పోలీసు విభాగం పునర్ వ్యవస్థీకరణ ఇంకా తుది దశకు చేరుకోకముందే పలువురు పోలీసు అధికారులు పైరవీల బాటపట్టారు. కానిస్టేబుల్, ఎస్‌ఐ, ఇన్‌స్పెక్టర్, డీఎస్పీ ర్యాంక్ అధికారుల వరకు తమకు నచ్చిన చోట పోస్టింగ్ కోసం ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తమ సన్నిహితులను ప్రసన్నం చేసుకునే పనిలో తలమునకలయ్యారు. కానిస్టేబుల్ నుంచి ఎస్‌ఐలు, డీఎస్పీల వరకూ పలువురు అధికారులు నేతల సిఫారసు లేఖల కోసం చక్కర్లు కొడుతున్నారు.
రాజకీయ నేతల జోక్యం..
సాధారణంగా పోలీసు బదిలీలు, పోస్టింగ్‌లలో రాజకీయ నేతల జోక్యం ఎక్కువగా ఉంటుందనేది బహిరంగ రహస్యమే. శాసనసభా నియోజకర్గ పరిధిలోని ఠాణాలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ), ఏసీపీ పోస్టింగ్స్‌కు సంబంధిత ప్రజా ప్రతినిధి ఆమోదముద్ర ఉండాల్సిందే. నేత మాట కాదని ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేసినా బాధ్యతలు చేపట్టడం కత్తిమీద సాముగా మారింది. ఇటీవల గ్రేటర్‌లో కొత్తగా ఏర్పడిన ఓ డివిజన్‌కు ఏసీపీ పోస్టు కేటాయిస్తూ ఓ అధికారికి ఉత్తర్వులు జారీ చేశారు. తీరా ఆయన బాధ్యతలు చేపట్టకుండానే తిరిగి హెడ్ క్వార్టర్స్‌కు చేరారంటే స్థానిక నేతల ప్రభావం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక్కడ పోస్టింగ్‌లకు డిమాండ్..
నగర శివారు ప్రాంతాల్లో జనావాస విస్తరణతో భూములకు గిరాకీ పెరిగింది. దీంతో భూ లావాదేవీలు అధికంగా జరిగే ప్రాంతాల్లోని ఠాణాలలో పోస్టింగ్ కోసం పలువురు పోలీసు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందంగా పోస్టింగ్‌లో ఉన్నప్పుడు ఎంతో కొంత వెనకేసుకోవాలని పలువురు అధికారులు భావిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణమని ఓ పోలీసు ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. గ్రేటర్‌లో ఖరీదైన కమిషనరేట్‌గా పేరున్న ప్రాంతంలో ఏసీపీ, డీసీపీ పోస్టింగ్‌లకు ఫుల్ డిమాండ్ ఉంది. అక్కడ తమకు అవకాశం కల్పిస్తే అండగా ఉంటామంటూ ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారు. హోటళ్లు, స్పాలు, ఐటీ కంపెనీలున్న ఓ డివిజన్‌లో తానే ఏసీపీనంటూ ఓ అధికారి ముందుగానే సిబ్బందికి చెబుతుండటం గమనార్హం.
వామ్మో ఆ కమిషనరేటా?
గ్రేటర్‌లో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరిలతో పాటు నాలుగో పోలీసు కమిషనరేట్ ఫ్యూచర్ సిటీ ఏర్పాటైంది. దీంతో త్వరలోనే కొత్త జోన్లు, డివిజన్లు, ఠాణాలు ఏర్పాటు కావడం అనివార్యం. ఇప్పటివరకు లూప్ లైన్‌లో ఉన్న పలువురు పోలీసు అధికారులు ఆయా ఫోకల్ పోస్టింగ్‌లు దక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. తమకు అనుకూలమైన పోస్టింగ్‌ల కోసం ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఉన్నతాధికారులకు ఫోన్లు సైతం చేయిస్తున్నారనే పోలీసు శాఖలో ప్రచారం జరుగుతోంది. రూల్‌బుక్ ఆఫీసర్‌గా పేరున్న ఓ పోలీసు బాస్ కమిషనరేట్‌లో పనిచేసేందుకు పలువురు పోలీసులు జంకుతున్నారు. దీంతో వేరే కమిషనరేట్‌కు బదిలీ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.


