హారర్‌ సఫారీ!.. చిరుత భయంకర దాడి | Shocking Safari Attack, Leopard Claws Woman Through Bus Window At Bannerghatta Park, Watch Video Inside | Sakshi
Sakshi News home page

హారర్‌ సఫారీ!.. చిరుత భయంకర దాడి

Nov 15 2025 7:09 AM | Updated on Nov 15 2025 10:59 AM

Bannerghatta park Woman injured as leopard paws through safari bus

సాధారణంగా సఫారీ అంటే అద్భుతమైన అనుభూతి.. కానీ, బెంగళూరులోని బన్నేరుఘట్ట జాతీయ పార్కుకు వెళ్లిన ఒక చెన్నై మహిళకు మాత్రం అది భయంకరమైన పీడకలగా మిగిలిపోయింది. అడవి జంతువుల్ని చూసేందుకు ఆమె ఉత్సాహంగా సఫారీ బస్సులో ప్రయాణిస్తోంది. ఉన్నట్టుండి ఓ చిరుత ఒక్కసారిగా బస్సుపైకి దూకి, రక్షణ కోసం ఏర్పాటు చేసిన జాలీలోంచి ఆమె చేతిపై పంజా విసిరింది..

బస్సుపైకి దూకిన చిరుత..  
చెన్నైకి చెందిన 56 ఏళ్ల వహితా భాను అనే మహిళ గురువారం మధ్యాహ్నం 1 గంట స మయంలో బన్నేరుఘట్ట జాతీయ పార్కులో చిరుత సఫారీ ట్రిప్‌లో పాల్గొన్నారు. ఆమె కదలికలను గమనిస్తున్న చిరుత ఒక్కసారిగా బస్సు పైకప్పు పైకి లంఘించింది. అద్దం పక్కనే ఉన్న జాలీ ద్వారా లోపలికి పంజా విసిరి మహిళను గాయపరిచింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలో.. బస్సుపైకి చిరుత ఎక్కి, కిటికీ గుండా దాడి చేయడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు భయానకంగా కనిపిస్తున్నాయి. చిరుత పంజా దాడి లో వహితా భాను చేతికి గాయాలయ్యాయి. వెంటనే అక్కడికక్కడే ప్రథమ చికిత్స చేశారు. అనంతరం ఆమెను మెరుగైన చికిత్స నిమిత్తం జిగానిలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.

 భద్రత ప్రశ్నార్థకం 
సాధారణంగా, జంతువులు, సందర్శకుల మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని నివారించడానికి సఫారీ బస్సులకు కిటికీలు, ఇతర రంధ్రాలపై లోహపు వైర్‌ మెష్‌ (జాలీ) అమర్చుతారు. అయితే, ఈ చిరుత ఆ జాలీలోని చిన్న ఖాళీ గుండా లోపలికి పంజా విసిరి మహిళను రక్కగలిగింది. ‘మహిళ చేతికి గాయాలయ్యాయి. ఆమెను చికిత్స కోసం ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించాం. ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు’.. అని ఒక అధికారి వెల్లడించారు.

తాత్కాలికంగా సఫారీ నిలిపివేత 
గతంలో కూడా చిరుత దాడి జరిగిన నేపథ్యంలో.. బస్సుల భద్రతను పూర్తిగా అంచనా వేసే వరకు, నాన్‌–ఏసీ బస్సు సఫారీని నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ‘సమస్య పరిష్కారమయ్యే వరకు వాహనాల పూర్తి భద్రతను అంచనా వేస్తాం. సందర్శకులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం’.. అని పేర్కొన్నారు. బన్నేరుఘట్ట జాతీయ పార్కులో జరిగిన ఈ ఘటన సఫారీ వాహనాల భద్రతపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. కనీస రక్షణ ఏర్పాట్ల విషయంలో ఏ మాత్రం చిన్న లోపం ఉన్నా.. ఎంత పెద్ద ప్రమాదం జరుగుతుందో ఈ సంఘటన రుజువు చేసింది.      – సాక్షి, నేషనల్‌ డెస్క్‌   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement