
ముంబై: భారత్‌లో అక్రమంగా ఉంటున్న విదేశీయుల ఏరివేతపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపధ్యంలో పలువురు అక్రమ వలసదారులపై చర్యలు తీసుకుంటోంది. తాజాగా మహారాష్ట్రలోని ముంబై పోలీసులు ‘గురు మా’ పేరుతో గుర్తింపు పొందిన జ్యోతి అనే బంగ్లాదేశ్‌కు చెందిన ట్రాన్స్ జెండర్‌ను అరెస్టు చేశారు.
ట్రాన్స్ జెండర్ జ్యోతి గత 30 ఏళ్లుగా నకిలీ ధృవపత్రాలతో భారత్‌లో ఉంటున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జ్యోతి అసలు పేరు బాబు అయాన్ ఖాన్. ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్ వచ్చి, ఇక్కడ ఉంటున్న వలసదారులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే జ్యోతితో పాటు ఆమె సహచరులను ముంబైలోని శివాజీ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమె వద్ద ఆధార్ కార్డు, పాన్ కార్డ్ ఇతర ధృవీకరణ పత్రాలు ఉండటంతో తొలుత వదిలేశారు. అయితే ఆ తరువాత జ్యోతికి సంబంధించిన ధృవపత్రాలను మరోమారు తనిఖీ చేయడంతో అవి నకిలీవని తేలింది. దీంతో ఆమెను అరెస్టు చేశారు.
శివాజీ నగర్, నార్పోలి, డియోనార్, ట్రోంబే, కుర్లాతో సహా ముంబై పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో జ్యోతిపై ఇప్పటికే పలు నేర సంబంధిత కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. జ్యోతికి ముంబైలోని పలు ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో జ్యోతిని ‘గురు మా’ పేరుతో పిలుస్తారు. జ్యోతికి పలువురు అనుచరులు కూడా ఉన్నారు. జ్యోతి అలియాస్ ‘గురు మా’ను పాస్‌పోర్ట్ చట్టంలోని వివిధ సెక్షన్లతో పాటు భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్)లోని పలు నిబంధనల కింద అరెస్టు చేశారు.
ఇదిలావుండగా ఢిల్లీలోని షాలిమార్ బాగ్, మహేంద్ర పార్క్ ప్రాంతాలలో నిర్వహించిన వరుస ఆపరేషన్లలో ఢిల్లీ పోలీసులు దేశంలో అక్రమంగా నివసిస్తున్న పది మందికి పైగా బంగ్లాదేశీయులను అరెస్టు చేశారు. వీరంతా మహిళలుగా కనిపించేందుకు సంబంధిత శస్త్రచికిత్సలు చేయించుకున్నారని, భిక్షాటన చేస్తుంటారని పోలీసులు దర్యాప్తులో తేలింది.
‘హైదర్‌పూర్ మెట్రో స్టేషన్, న్యూ సబ్జీ మండి ప్రాంతాలలో అనుమానిత బంగ్లాదేశీయుల గురించి అందిన సమాచారం మేరకు పోలీసులు ఆ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. హైదర్‌పూర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఎనిమిది మందిని, న్యూ సబ్జీ మండి సమీపంలో ఇద్దరిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో వారు చెబుతున్న భారత పౌరసత్వ వాదనలపై సందేహాలు తలెత్తాయని ఒక పోలీసు అధికారి మీడియాకు తెలిపారు.