
ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఒకటి నుండి ఐదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ హిందీని తప్పనిసరి చేస్తామని ప్రకటించిన దరిమిలా మరాఠీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. సరిగ్గా ఇదే సమయంలో శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రేకు సంబంధించిన పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బీజేపీ నేతృత్వంలోని మహాయతి కూటమి రాష్ట్రంలోని పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేయాలన్న ప్రణాళికను.. బాల్‌థాక్రే కుమారుడు ఉద్ధవ్ థాక్రే, అతని సోదరుడు (బాల్‌థాక్రే అన్న కుమారుడు) రాజ్ థాక్రేలు ఒకే వేదికపై చేరి, తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపధ్యంలో శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం విశేషంగా మారింది. ఆ వీడియోలో భుజంపై కాషాయ శాలువా ధరించిన బాల్‌థాక్రే ‘నేను మరాఠీ వాడినే కావచ్చు.. కానీ భారతదేశంలోని హిందువును’ అని పేర్కొనడాన్ని గమనించవచ్చు. అలాగే బాషా గుర్తింపుల కన్నా హిందుత్వాన్ని స్వీకరించడం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
"I may be Marathi in Maharashtra but I am Hindu in Bharat. We must embrace Hindutva over linguistic identities"
Balasaheb Thackeray
pic.twitter.com/KRrMVkGpYc— Kashmiri Hindu (@BattaKashmiri) July 5, 2025
రెండు దశాబ్దాలుగా విబేధాలతో రగిలిపోతున్న ఉద్ధవ్, రాజ్ ముంబైలో ఒక వేదికపై చేరి, రాష్ట్రంలోని పాఠశాలల్లో హిందీ తప్పనిసరి విధానాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ర్యాలీ అనంతరం సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్’లో ఈ వీడియో ప్రత్యక్షమై వైరల్‌గా మారింది. కాగా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు హిందీని తప్పనిసరి భాషగా ప్రవేశపెట్టే ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఉద్ధవ్, రాజ్‌లు తమ ర్యాలీలో నినదించారు.
తండ్రి రాజకీయ సిద్ధాంతానికి వారసునిగా గుర్తింపు పొందిన ఉద్ధవ్ థాక్రే కొంతకాలంగా ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గంపై పోరాడుతున్నారు. రాజ్, తాను కలిసి ముంబై మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఉద్ధవ్ థాక్రే ప్రకటించారు. ఇదే సమయంలో రాజ్ థాక్రే తన సోదరునికి మద్దతు పలుకుతూ, బీజేపీ ప్రభుత్వం ఇక్కడి విద్యార్థులకు హిందీని తప్పనిసరి చేయడాన్ని తాము అనుమతించబోమని, ఈ ఉద్యమానికి మరాఠీ జనాభా ఐక్యంగా మద్దతునివ్వాలని పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: ‘మహా’తీరంలో పాక్ నౌక?.. అంతటా హై అలర్ట్