
ముంబై: మహారాష్ట్ర తీరంలో కలకలం చెలరేగింది. భారత నావికాదళ రాడార్ సముద్రంలో ఒక అనుమానాస్పద నౌకను గుర్తించగా, అది పాకిస్తాన్ ఫిషింగ్ నౌక అయివుండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రేవ్‌దండా తీరం సమీపంలో ఈ అనుమానాస్పద నౌక కనిపించిన దరిమిలా మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ తీరం వెంబడి భద్రతను మరింతగా పెంచారు.
తీరం వెంబడి పోలీసు దళాలను మోహరించారు. ముందు జాగ్రత్త చర్యగా రాయగఢ్ జిల్లాలో భద్రతను పెంచారని ఒక అధికారి తెలిపారు. ఆదివారం రాత్రి భారత నావికాదళ రాడార్ రెవ్‌దండాలోని కొర్లై తీరానికి రెండు నాటికల్ మైళ్ల దూరంలో అనుమానస్పద నౌకను గుర్తించింది. ప్రస్తుతం పోలీసులు, సముద్రతీర భద్రతా సిబ్బంది ఆ నౌక కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. రాయ్‌గడ్ పోలీసులు, క్విక్ రెస్పాన్స్ టీమ్ (క్యూఆర్‌టీ), బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (బీడీడీఎస్), నేవీ కోస్ట్ గార్డ్ సిబ్బంది అనుమానాస్పద నౌక ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. రాయ్‌గడ్ పోలీసు సూపరింటెండెంట్ (ఎస్ఫీ) అంచల్ దలాల్, ఇతర సీనియర్ పోలీసు అధికారులు తీరానికి చేరుకున్నారు. ఆ నౌకను చేరుకునేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే వాతావరణం అనుకూలంగా లేని కారణంగా వారు వెనుదిరిగారు. భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా పడవను గుర్తించి, దానిని చేరుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం లేదు.
