
ముంబై: మహారాష్ట్రలో బాషా వివాదాలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. తాజాగా విరార్ ప్రాంతంలో ఇటువంటి ఘటనే జరిగింది. శివసేనలోని ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన కార్యకర్తలు మరాఠీలో మాట్లాడేందుకు నిరాకరించిన ఆటో డ్రైవర్‌పై దాడి చేశారు. ఆ డ్రైవర్ గతంలో ఒక వీడియోలో తాను హిందీ, భోజ్‌పురిలో మాట్లాడటం కొనసాగిస్తానని ప్రకటించాడు. ఇది కొన్నివర్గాలకు ఆగ్రహాన్ని తెప్పించింది.
శనివారం సాయంత్రం విరార్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన కార్యకర్తలు ఆ డ్రైవర్‌ను వెతికి పట్టుకుని, అతనిపై దాడి చేశారు. తరువాత మరాఠీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. శివసేన (యూబీటీ) విరార్ నగర చీఫ్ ఉదయ్ జాదవ్ ఈ చర్యను సమర్థించారు. ‘ఎవరైనా మరాఠీ భాషను, మహారాష్ట్రను, మరాఠీ ప్రజలను అవమానించే ప్రయత్నం చేస్తే, వారికి శివసేన తనదైన శైలిలో సమాధానం ఇస్తుందని జాదవ్ హెచ్చరించారు.
#Auto driver assaulted in #Virar for not speaking #Marathi, #UddhavThackeray Sena workers force public apology | Video#ShivsenaUBT #Shivsena #MarathiNews https://t.co/PLsFHzDsN0
— IndiaTV English (@indiatv) July 13, 2025
కాగా పలువురు ఈ దాడిని ఖండించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరైనదికాదన్నారు. కాగా ఈ ఘటనపై పోలీసులు ఎటువంటి అధికారిక ఫిర్యాదును నమోదు చేయలేదు. మహారాష్ట్రలో భాషా రాజకీయాలపై తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్‌ఎస్) ఇటువంటి వివాదాల్లో చిక్కుకున్న దరిమిలా.. ఇప్పుడు ఉద్ధవ్ థాక్రే వర్గం కూడా ఇలాంటి దూకుడు చర్యలకు పాల్పడుతోందనే మాట వినిపిస్తోంది.