
న్యూఢిల్లీ: రాజకీయ నాయకులు తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటూ వరుసగా నెల రోజులు జైల్లో ఉంటే వారు తమ పదవులకు రాజీనామా చేయాల్సిందేనని బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. బిల్లును విపక్షాలు వివాదాస్పద బిల్లు అని అంటుంటే, కేంద్రం మాత్రం దాన్ని సమర్ధించుకుంటుంది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పైబడినా ఈ తరహా బిల్లును ఎవరూ తీసుకురాలేదని, దీన్ని తీసుకొచ్చినందుకు ఎన్డీఏ ప్రభుత్వం గర్విస్తుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
బిల్లులకు చట్ట సవరణలు చేయాలా? వద్దా? అని అమిత్ షా ప్రశ్నించారు. ఈ బిల్లుకు చట్ట సవరణ వద్దు అని విపక్షాలు పట్టుబట్టినా దాన్ని తాము ముందుకు తీసుకెళ్లామన్నారాయన.
పీఎం నుంచి సీఎం, మంత్రులు ఇలా వెవరైనా తీవ్ర నేరాలకు పాల్పడి ఆ అభియోగాలపై 30 రోజుల పాటు జైల్లో ఉంటే రాజీనామా చేయాలనే బిల్లును తీసుకొస్తే తప్పేముందని ఓ ఇంటర్వ్యూలో అమిత్ షా ప్రశ్నించారు. ఇది ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కారణంగానే తీసుకొచ్చిన బిల్లు అనే చర్చకు కూడా ఆయన పుల్‌స్టాప్ పెట్టారు. లిక్కర్ కేసులో జైలు పాలైన అరవింద్ కేజ్రీవాల్ అప్పుడే రాజీనామా చేసి ఉంటే ఈ బిల్లు వచ్చి ఉండేది కాదేమో అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చారు అమిత్ షా.
ఎక్కడైనా నైతికత అనేది చాలా ముఖ్యమైనదని, దాన్ని తుంగలో తొక్కి మళ్లీ పదవులు అలంకరిస్తామంటే కుదరదన్నారు. తీహార్ జైలు నుంచే కేజ్రీవాల్ పరిపాలన సాగించిన విషయాన్ని అమిత్ షా ఉదహరించారు. ప్రజాస్వామ్యంలో నైతికతకు ప్రతీ ఒక్క రాజకీయ పార్టీ బాధ్యత తీసుకోవాలనేది తమ విధానమన్నారు. ఈ క్రమంలోనే బిల్లును సవరించామన్నారు.
‘ఈ దేశంలోని ప్రజలు.. ఏ రాష్ట్ర సీఎం అయినా జైల్లో ఉండి పరిపాలించాలని కోరుకుంటారా?, ఇదేంటో అర్థం కావడం లేదు. ఇక్కడ ఎవరి వైపు నుంచి చూసినా నైతికత అనేదే ముఖ్యం’ అని కేరళలోని మనోరమా న్యూస్ కాంక్లేవ్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
People of the nation have to decide whether they want a PM, CM, or minister to run government from jail. pic.twitter.com/a8yiTYXM5T
— Amit Shah (@AmitShah) August 22, 2025
కాగా, గతేడాది ఢిల్లీ సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ మద్యం పాలసీ కేసులో జైలు శిక్షను అనుభవించారు. జైలు నుంచి పరిపాలన కొనసాగించారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో ఓటమి సంగతి అటుంచితే.. లిక్కర్ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ రాజీనామా చేయలేదు.