
పట్నా: బీహార్ ఎన్నికల నేపధ్యంలో ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ యాక్టివ్‌గా మారారు. సోమవారం మధుబని జిల్లాలోని జీరో మైల్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, తేజస్వీ యాదవ్‌పై మాటల దాడి చేశారు. వీరి వలనే బీజేపీ గెలుస్తుందని ఆరోపించారు. తేజస్వి ఓటర్లు మోదీ ఒడిలో కూర్చుని టీ తాగుతున్నందున బీజేపీనే గెలుస్తుందని ఆయన అన్నారు. వారు తమ ఓటర్లను ఒప్పించలేక, అందుకు బదులుగా ఒవైసీని నిందిస్తున్నారన్నారు. తేజస్విని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మీరు ఇలాగే అహంకారంతో వ్యవహరిస్తూ ఉంటే, బీహార్ ప్రజలు మిమ్మల్ని క్షమించరని ఆయన అన్నారు.
ముస్లిం సమాజం తమ సొంత నాయకత్వాన్ని అభివృద్ధి చేసుకునే వరకు, వారి సమస్యలను పరిష్కరించలేమని ఎంపీ వ్యాఖ్యానించారు. బీహార్ జనాభాలో ముస్లింలు 19 శాతం ఉన్నారని, వీరు లేకుండా ఏ ప్రభుత్వాన్నీ ఏర్పాటు చేయలేమని, ఎటువంటి రాజకీయ నిర్ణయం తీసుకోలేమని ఒవైసీ అన్నారు. ఏఐఎంఐఎం చేస్తున్న పోరాటంలో ప్రజల మద్దతు చాలా అవసరమన్నారు. బీహార్‌లో నితీష్ కుమార్ తిరిగి అధికారంలోకి రావాలని కోరుకోవడం లేదన్నారు. బీహార్‌లో 60 శాతం జనాభా 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారేననని, ఓటర్లు ఓటు వేసేముందు యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలని అన్నారు.
తాము కాంగ్రెస్‌కు, లాలూ యాదవ్‌లకు లేఖ రాశామని, తమతో పొత్తు పెట్టుకుని తమకు ఆరు సీట్లు ఇవ్వాలని కోరుతున్నామని ఒవైసీ తెలిపారు. మీరు అధికారంలోకి వస్తే మా ఎమ్మెల్యేలను మంత్రులను చేయనవసరం లేదని, బీజేపీ మతతత్వాన్ని ఎదుర్కోవాలనేదే తమ డిమాండ్ అని అన్నారు. వారు తమ వినతిని అంగీకరించలేదన్నారు. ఎన్నికల ఫలితం భిన్నంగా ఉంటే, మోదీ.. బీహార్‌కు రాకుండా ఎవరు అడ్డుకుంటున్నారో అందరికీ అర్థం అవుతుందన్నారు.