విచారణ నుంచి తప్పుకోనన్న ఢిల్లీ హైకోర్టు జడ్జి
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసు విచారణ నుంచి తనను తప్పుకోవాలంటూ ఆప్ చీఫ్ కేజ్రీవాల్, తదితరులు వేసిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ తోసిపుచ్చారు. ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలతో కక్షిదారు ఓ న్యాయమూర్తిని గురించి అంచనా వేయజాలరని ఆమె తన తీర్పు పేర్కొన్నారు. కక్షిదారు పక్షపాతపూరితంగా చేసే నిరాధార ఆరోపణలతో న్యాయమూర్తులు విచారణ నుంచి తప్పుకోరాదని పేర్కొన్నారు. సరైన కారణం చూపకుండా న్యాయవ్యవస్థను ఓ రాజకీయ నాయకుడు దెబ్బతీసేందుకు చేసే ప్రయత్నాలను కొనసాగనివ్వ రాదని తెలిపారు.
న్యాయమూర్తిపై వ్యక్తిగత దాడిని ఏకంగా న్యాయవ్యవస్థపైనే జరుగుతున్న దాడిగా ఆమె అభివరి్ణంచారు. ‘నన్ను విచారణ నుంచి తప్పుకోవాలంటూ వేసిన పిటిషన్లలోని అంశాలు కేవలం ఊహాగానాలు, అభిప్రాయాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ కోర్టు నా గౌరవం కోసం, న్యాయవ్యవస్థ కోసం గట్టిగా నిలబడుతుంది. నేను విచారణ నుంచి వైదొలగను’ అని స్పష్టం చేశారు. గతంలో ఈ కేసు విచారణ సందర్భంగా తన విషయంలో జస్టిస్ స్వర్ణ కాంత పక్షపాతంతో వ్యవహరించారని, అందుకే ఆమె ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవాలంటూ కేజ్రీవాల్ పిటిషన్ వేయడం తెల్సిందే.


