
బీహార్ ఓటరు జాబితా సవరణలో.. ఆధార్ కార్డుకు పౌరసత్వ గుర్తింపుకార్డుల జాబితా నుంచి మినహాయింపు ఇవ్వడాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం మరోసారి తీవ్రంగా పరిగణించింది. ఆధార్‌తో పాటు ఓటర్ ఐడీ ఎలక్టోరల్ ఫొటో ఐడెంటిటీ కార్డు(EPIC)ని చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్ల కింద పరిగణించాల్సిందేనని కేంద్ర ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది.
బీహార్ ఓటర్ లిస్ట్ రివిజన్‌లో భాగంగా ఆధార్‌ను గుర్తింపుకార్డుగా ఈసీ పరిగణించడం లేదు. తద్వారా ఓట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది. సోమవారం విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత ధర్మాసనం ఈసీని ఉద్దేశించి కీలక వ్యాఖ్య చేసింది. ‘‘భూమ్మీద దేనినైనా ఫోర్జరీ చేస్తారు కదా?’’ అని కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరాలపై సూటిగా ప్రశ్నను సంధించింది. ఈ క్రమంలో..
ఆధార్‌ను తిరస్కరిస్తూ.. బీహార్ ఓటర్ల రివిజన్ ప్రక్రియలో ఓట్లను తొలగిస్తూ వస్తోంది ఎన్నికల సంఘం. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. జులై 10వ తేదీ నాటి విచారణ సందర్భంగా బీహార్ ఓటర్ లిస్ట్ రివిజన్ సబబేనన్న సుప్రీం ధర్మాసనం.. అదే సమయంలో ఆధార్, ఎపిక్, రేషన్ కార్డులనూ పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని ఈసీకి స్పష్టం చేసింది. అయితే.. ఇవాళ్టి వాదనల సందర్భంగా ఆధార్‌ను ప్రూఫ్ ఆఫ్ సిటిజన్‌షిప్‌గా పరిగణించడం కుదరదని, రేషన్ కార్డులు నకిలీవి సృష్టించే అవకాశం లేకపోలేదని.. కాబట్టి వాటి మీద ఆధారపడలేమని ఈసీ వాదనలు వినిపించింది. అలాగే ఓటర్ నమోదు ప్రక్రియలో ఆధార్‌ను కేవలం ఐడెంటిటీ ఫ్రూఫ్‌గా మాత్రమే పరిగణిస్తామని పేర్కొంది.
దీనిపై సుప్రీం కోర్టు స్పందించింది. ఈ భూమ్మీద ఏ డాక్యుమెంట్‌ను ఫోర్జరీ చేయలేరో చెప్పాలంటూ ఈసీని ప్రశ్నించింది. ఓటర్ నమోదు సమయంలో ఆధార్ ప్రస్తావన ఉంటున్నప్పటికీ.. ఓటరు జాబితా గుర్తింపు కోసం ఎందుకు పరిగణించడం లేదని మరోసారి నిలదీసింది. ఈ క్రమంలో.. ఆధార్, ఎపిక్‌ని బీహార్ ఓటర్ రోల్ రివిజిన్‌కు చేర్చాలంటూ ఆదేశించింది.
ఎన్నికల సంఘం (EC) జాబితాలోని ఏదీ నిర్ణయాత్మక పత్రం కాదు కదా. ఆధార్, ఎపిక్ విషయాల్లో మీరు ఎత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటే గనుక రేపు మీరు అంగీకరించిన ఇతర పత్రాలు కూడా ఫోర్జరీ జరిగితే.. దాన్ని నిరోధించే వ్యవస్థ ఎక్కడ? అని ఈసీకి ప్రశ్న ఎదురైంది.
అదే సమయంలో.. ఆగస్టు 1వ తేదీన ఈసీ ప్రచురించబోయే బీహార్ ఓటర్ల డ్రాఫ్ట్ లిస్ట్‌పై మధ్యంతర స్టే విధించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది గోపాల్ శంకర్‌నారాయణన్ కోరారు. అయితే.. రేపటి విచారణలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని బెంచ్ స్పష్టం చేసింది.