ఇల్లు ఊడ్చా.. అంట్లు తోమా.. అయినా కొట్టేవారు! | Another Atul Subhash: Haryana Mans Final Video Sparks Debate | Sakshi
Sakshi News home page

ఇల్లు ఊడ్చా.. అంట్లు తోమా.. అయినా కొట్టేవారు!

Jun 29 2026 12:58 PM | Updated on Jun 29 2026 1:55 PM

Another Atul Subhash: Haryana Mans Final Video Sparks Debate

ప్రేమించాడు.. పెళ్లి చేసుకున్నాడు. భార్య చెప్పిందని తల్లిదండ్రుల్ని వదిలేసి.. వేరు కాపురం పెట్టాడు. అత్తింటి వారినే తన సొంత తల్లిదండ్రులుగా భావించాడు. వాళ్లు చెప్పిన ప్రతి మాటను కాదనకుండా పాటించాడు. ఆ కుటుంబం కోసం తనను తాను మార్చుకున్నాడు. కానీ చివరికి అతని జీవితమే విషాదాంతమైంది. మరణానికి ముందు విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. అసలేం జరిగిందంటే..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అతుల్‌ సుభాష్‌ కేసు గుర్తుందా?. మరణానికి ముందు ఆయన విడుదల చేసిన దాదాపు 81 నిమిషాల వీడియో, 24 పేజీల సూసైడ్‌ నోట్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. భార్య, అత్తింటి వేధింపుల ఆరోపణలతో ఆ వీడియోలో చేసిన వ్యాఖ్యలు, ఆయన రాసిన లేఖలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీశాయి. సరిగ్గా అలాంటి ఘటనే ఇది కూడా. భార్య, అత్తింటి వాళ్ల వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడ్డ మరో భర్త దీనగాథే ఇది.

హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన 28 ఏళ్ల వ్యాపారి రాహుల్‌.. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్‌ చేసిన కొద్దిసేపటికే తన దుకాణంలో ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్యతో పాటు అత్తింటి కుటుంబ సభ్యుల వేధింపులే ఈ నిర్ణయానికి కారణమని వీడియోలో ఆరోపించాడు.

బల్లభ్‌గఢ్‌లో నివసించే రాహుల్‌కు రెండేళ్ల క్రితం జ్యోతితో ప్రేమ వివాహం జరిగింది. పెళ్లి తర్వాత భార్య ఒత్తిడితో.. తల్లిదండ్రుల నుంచి దూరంగా వేరు కాపురం పెట్టాడు. ఆమె అమ్మానాన్నల బాగోగులు కూడా అతనే చూసుకుంటున్నాడు. అయితేవలే గార్మెంట్స్‌ షాపు ప్రారంభించిన రాహుల్‌ కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నాడని బంధువులు చెబుతున్నారు.

మరణానికి ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన వీడియోలో భార్య జ్యోతి, అత్త వీణ, మామ బిట్టు, భార్య సోదరి నీతూ పేర్లను ప్రస్తావించిన రాహుల్‌.. దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడించాడు. వాళ్ల కోసం తాను అడ్డమైన పనులు చేసేవాడినని చెప్పాడా భర్త. ఇల్లు ఊడ్చడం, తుడవడం, పాత్రలు తోమడం, బట్టలు  ఉతకడం వంటి పనులన్నీ చేసేవాడినని.. అయినా వాళ్లు తనను శారీరకంగా, మానసికంగా వేధించారని  ఆవేదన ‍వ్యక్తం చేశాడు.

ఆపై సొంతంగా వ్యాపారం పెట్టుకుంటే.. డబ్బు కోసం, అందులో భాగస్వామ్యం కోసం వేధించడం మొదలుపెట్టారని చెప్పాడు. తప్పుడు కేసులతో ఇబ్బందులకు గురి చేశారని, తన మరణానికి వారే బాధ్యులని పేర్కొంటూ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరాడు. తన ఆస్తిని తల్లి, సోదరులు, సోదరికి ఇవ్వాలని కూడా వీడియోలో విజ్ఞప్తి చేశాడు.

ఆదివారం ఉదయం ఇంటి నుంచి తన దుకాణానికి వెళ్లిన రాహుల్‌.. కొద్దిసేపటికే అక్కడ మృతిగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కొడుకు మృతదేహం చూసి రాహుల్‌ తల్లిదండ్రులు కంటతడి పెట్టిన తీరు పలువురిని కదిలించింది.

అయితే వైరల్‌ అవుతున్న ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోను పోలీసులు పరిశీలిస్తున్నారు. దర్యాప్తు జరపకుండా.. ఆ ఆరోపణలు నిజమని చెప్పలేమని అంటున్నారు. దర్యాప్తులో భాగంగా ఆ వీడియోను పరిశీలిస్తున్నామని, అన్ని కోణాల్లో విచారణ పూర్తయ్యాకే వాస్తవాలు వెల్లడిస్తామని తెలిపారు. మరోవైపు.. భర్త మృతి, కేసు గురించి స్పందించేందుకు జ్యోతి కుటుంబం మీడియాకు అందుబాటులో లేకపోవడం గమనార్హం.

మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement