లేదంటే మళ్లీ జాతీయస్థాయిలో ఉద్యమిస్తాం
కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక
న్యూఢిల్లీ: చలో సంసద్ ర్యాలీ సందర్భంగా నెలకొన్న ఉద్రిక్తత వేళ విద్యార్థులపై పోలీసులు మోపిన కేసులను రద్దుచేసేందుకు సుప్రీంకోర్టు సానుకూలత వ్యక్తంచేసినా అందుకు మోదీ ప్రభుత్వం సముఖంగా లేదని కాక్రోచ్ జనతా పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ మేరకు సీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘‘జూలై 25న సీజేపీకి మోదీ సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందే. విద్యార్థులపై కేసులు ఎత్తేయాలి. ఈ దిశలో ఆలోచనచేసిన సుప్రీంకోర్టు ఎదుట ప్రభుత్వం మోకాలడ్డొద్దు.
అలా చేస్తే సీజేపీ జాతీయ కార్యవర్గ కమిటీ రెండ్రోజుల్లో సమావేశమై మళ్లీ జాతీయస్థాయి ఉద్యమానికి రంగం సిద్ధంచేస్తుంది’’అని ఆయన హెచ్చరించారు. ‘‘విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల జాబితా ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరితే ప్రభుత్వం ఆ జాబితాను ఉద్దేశపూర్వకంగా అందజేయలేదు. జాబితా ఇస్తే ఆ కేసులన్నింటినీ 142వ అధికరణం ద్వారా దఖలుపడిన అధికారం ద్వారా రద్దుచేస్తామని కోర్టు మంగళవారం మూడు సార్లు గుర్తుచేసి, జాబితా అడిగినా ప్రభుత్వం సమర్పించలేదు.
ప్రభుత్వ వైఖరిని గమనిస్తున్నాం. ప్రభుత్వం నిర్ణయాలకు తగ్గట్లే దీటైన సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇద్దరు కేంద్ర మంత్రులు మాట ఇచ్చి తప్పారు. యావత్ భారత దేశ యువత నమ్మకంతో ఆటలాడతామంటే మేం చూస్తూ ఊరుకోం. ఇకనైనా కోర్టు నియమించిన హైపవర్ కమిటీలో సీజేపీకి ప్రాతినిధ్యం ఇవ్వాలి. పోలీసుల దారుణాలను వివరించే అవకాశం ఇవ్వాలి’’అని దాస్ కోరారు.


