రాజీనామా రచ్చ అంతా ఉత్తదేనా? | Annamalai: Resignation Rumours or Big Plan | Sakshi
Sakshi News home page

రాజీనామా రచ్చ అంతా ఉత్తదేనా?

Jun 3 2026 12:58 PM | Updated on Jun 3 2026 1:02 PM

Annamalai: Resignation Rumours or Big Plan

తమిళనాడు రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారిన ‘అన్నామలై రాజీనామా’ ఎపిసోడ్‌ కొత్త మలుపు తిరిగింది. బీజేపీని వీడబోతున్నారన్న ఊహాగానాల మధ్య ఢిల్లీలో పార్టీ అగ్రనేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారాయన. అయితే ఆయన తన రాజీనామా లేఖ అందించారనే ప్రచారం జోరుగా జరుగుతుండగా.. అసలు అలాంటి చర్చే జరగలేదన్న సమాచారం బయటకు వచ్చింది. దీంతో అసలు అన్నామలై వ్యూహం ఏమిటన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారన్న ప్రచారం ఇటీవల జోరందుకుంది. ఆయన ఢిల్లీలో మకాం వేసి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌, జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌లతో భేటీ కావడం ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చింది. తన అసంతృప్తిని నేరుగా అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సమావేశాల్లో రాజీనామా అంశం ప్రస్తావనకే రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బదులుగా తమిళనాడులో పార్టీ పరిస్థితి, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఏఐఏడీఎంకేతో పొత్తు ప్రభావం వంటి అంశాలపై అన్నామలై తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించినట్లు సమాచారం. దీంతో ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారన్నది ఉత్త ప్రచారంగా తెలుస్తోంది. 

తమిళనాడులో బీజేపీ స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదగాలని అన్నామలై ఎప్పటి నుంచో వాదిస్తున్నారు. ఏఐఏడీఎంకేతో పొత్తు పార్టీ విస్తరణకు అడ్డంకిగా మారుతోందని ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితం కావడం కూడా ఆయన అసంతృప్తికి కారణమైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అంతేకాదు, రాష్ట్ర బీజేపీ నేతలు, మిత్రపక్ష నేతల్లో కొందరి వైఖరిపైనా ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తామని, రాష్ట్ర నాయకత్వంతో చర్చిస్తామని పార్టీ అధిష్ఠానం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్‌ను కూడా ఢిల్లీకి పిలిపించినట్లు వార్తలు వచ్చాయి. రేపు అన్నామలై చెన్నైకి వస్తారని ఆయన అనుచర గణం చెబుతోంది. దీంతో ఆయన స్పందిస్తేనే.. ఈ ఉత్కంఠకు తెర పడే అవకాశం కనిపిస్తోంది. 

ఇదిలా ఉండగా, అన్నామలై త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అది బీజేపీకి అనుబంధంగా ఉంటుందా? లేదంటే కొత్తగా పార్టీ పెట్టడం, లేదంటే పార్టీ కంటే ముందుగా ఒక సామాజిక-ప్రజా వేదికను నిర్మించడంపై ఉంటుందా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. యువతతో పాటు వివిధ వర్గాల వారిని కలుపుకోవాలన్న వ్యూహంపై ఆయన దృష్టి పెట్టినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు, ఆయనకు రాజ్యసభ సీటు ఆఫర్‌ చేసినప్పటికీ తిరస్కరించారన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీంతో అన్నామలై ఆలోచనలు కేవలం పదవుల చుట్టూ కాకుండా, భవిష్యత్‌ రాజకీయ ప్రణాళికల వైపు సాగుతున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement